రూ.5,470 కోట్లు.. జీహెచ్‌ఎంసీకి తొలి పద్దు ప్రతిపాదనలు
ABN , Publish Date - Nov 17 , 2026 | 09:57 AM
జీహెచ్‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.5,470 కోట్లతో రూపొందించారు. గతంలో పూర్వ జీహెచ్‌ఎంసీ, విలీన మునిసిపాల్టీలకు కలిపి పద్దు ఆమోదించిన నేపథ్యంలో కొత్త సరిహద్దులు, ప్రాంతాలతో ఏర్పడిన సంస్థకు సంబంధించి తొలి బడ్జెట్ సిద్ధం చేశారు.
ఆమోదించిన స్టాండింగ్ కమిటీ
సరిహద్దులు మారిన అనంతరం మొదటి బడ్జెట్
గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గింపు
ఆదాయం తగ్గడమే కారణం
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూ.5,470 కోట్లతో రూపొందించారు. గతంలో పూర్వ జీహెచ్‌ఎంసీ, విలీన మునిసిపాల్టీలకు కలిపి పద్దు ఆమోదించిన నేపథ్యంలో కొత్త సరిహద్దులు, ప్రాంతాలతో ఏర్పడిన సంస్థకు సంబంధించి తొలి బడ్జెట్ సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో పద్దును స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. పూర్వ జీహెచ్‌ఎంసీతో పోలిస్తే ప్రస్తుత గ్రేటర్ పద్దు గణనీయంగా తగ్గింది. 2026-27లో పూర్వ జీహెచ్‌ఎంసీ బడ్జెట్ అంచనాలు రూ.9,220 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.5,470 కోట్లకు తగ్గించారు. తెలంగాణ కోర్ ఆర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 27 మునిసిపాల్టీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్వ జీహెచ్‌ఎంసీ, విలీన మునిసిపాల్టీలకు బడ్జెట్ రూపొందించారు.
పూర్వ జీహెచ్‌ఎంసీ పద్దు రూ.9220 కోట్లు కాగా.. విలీన మునిసిపాల్టీలకు రూ.2260 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. క్యూర్ పరిధిలోని ప్రాంతాలకు రూ.11,880 కోట్లతో బడ్జెట్ ఆమోదం పొందింది. అనంతరం క్యూర్ పరిధిలోని 2053 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఫిబ్రవరి 11, 2026న జీహెచ్‌ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. ఏప్రిల్ నుంచి ఆర్ధిక సంవత్సరం ప్రారంభమైనా.. అంతకుముందే బడ్జెట్ రూపొందించిన నేపథ్యంలో మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకంగా పద్దుల రూపకల్పన జరగలేదు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించింది. సీఎంసీ, ఎంఎంసీలు కూడా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన చేయాల్సి ఉంటుందని ఆర్ధిక విభాగం వర్గాలు చెబుతున్నాయి.
కీలక ప్రాంతాలు ఆ కార్పొరేషన్లకు..
పూర్వ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్ జోన్ల పరిధిలోని ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలు సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోకి వెళ్లాయి. దీంతో జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను, భవన నిర్మాణ అనుమతులు, ఇతరత్రా ఆదాయం గణనీయంగా తగ్గింది. అందుకే బడ్జెట్ కూడా రూ.5,470 కోట్లకు తగ్గింది. వాస్తవ ఆదాయ, వ్యయాల ఆధారంగా పద్దు ప్రతిపాదించినట్టు ఆర్థిక విభాగం అధికారొకరు తెలిపారు. దీని ఆధారంగానే 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముసాయిదా పద్దును త్వరలో సిద్ధం చేయనున్నారు. పాలకమండలి లేని నేపథ్యంలో స్టాండింగ్ కమిటీ ఆమోదంతో ప్రభుత్వానికి పంపనున్నారు.
2026-27 బడ్జెట్ సంక్షిప్త స్వరూపం (రూ.కోట్లలో)...
రెవెన్యూ ఆదాయం - 3715
రెవెన్యూ వ్యయం - 1757.84
రెవెన్యూ మిగులు - 1957.16
మూలధన రశీదులు - 1755
మూలధన వ్యయం - 3712.16
మొత్తం బడ్జెట్ - 5,470 (రెవెన్యూ వ్యయం + మూలధన వ్యయం)

ఈ వార్తలు కూడా చదవండి:
టీమ్ వర్క్‌తో ఆర్టీసీని అగ్రగామిగా నిలపాలి
చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అగ్ని ప్రమాదం!
Read Latest AP News And Telangana News And International News And Telugu News