Share News

మా సైనిక స్థావరానికి కనీస రక్షణ లేదు.. అందుకే ఆరుగురు చనిపోయారు: అమెరికా ఆర్మీ మేజర్

ABN , Publish Date - Nov 17 , 2026 | 08:39 AM

ఇరాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉందని ముందుగానే హెచ్చరించినా అమెరికా సైనికాధికారులు పట్టించుకోలేదని ఓ ఆర్మీ మేజర్ సంచలన ఆరోపణలు చేశారు.

మా సైనిక స్థావరానికి కనీస రక్షణ లేదు.. అందుకే ఆరుగురు చనిపోయారు: అమెరికా ఆర్మీ మేజర్
Kuwait US Military Base

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉందని ముందుగానే హెచ్చరించినా అమెరికా సైనికాధికారులు పట్టించుకోలేదని ఓ ఆర్మీ మేజర్ సంచలన ఆరోపణలు చేశారు. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ డ్రోన్ దాడి చేసిన ఘటనలో ఆరుగురు అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్మీ మేజర్ స్టీఫెన్ రామ్స్‌బాటమ్ తాజాగా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి (Kuwait US Military Base).


కువైట్‌లోని పోర్ట్ షుఐబా వద్ద ఉన్న అమెరికా సైనిక కమాండ్ పోస్టుపై మార్చి 1న ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికా సైనికులు మరణించగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో అమెరికా ఆర్మీ మేజర్ స్టీఫెన్ రామ్స్‌బాటమ్ కూడా ఉన్నారు. ఈ దాడికి ముందు సైనిక స్థావరానికి తగిన రక్షణ లేదని తాను పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు రామ్స్‌బాటమ్ వెల్లడించారు. అయితే తన హెచ్చరికలను అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్‌కు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిపారు (US Iran War).


తాను పనిచేసిన సైనిక స్థావరంలో వైద్యుడు లేరని, ప్రత్యేక వైద్య కేంద్రం లేదని, కేవలం ఒక అంబులెన్స్ మాత్రమే అందుబాటులో ఉందని రామ్స్‌బాటమ్ పేర్కొన్నారు. వాహన బాంబు దాడుల వంటి ముప్పులను ఎదుర్కొనేందుకు మాత్రమే అక్కడ రక్షణ ఏర్పాట్లు ఉన్నాయని, గగనతలం నుంచి వచ్చే డ్రోన్ దాడులను అడ్డుకునే వ్యవస్థ లేదని తెలిపారు. పోర్ట్ షుఐబా స్థావరానికి డ్రోన్లను అడ్డుకునే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని తాము కోరినప్పటికీ పట్టించుకోలేదన్నారు (Iran Drone Attack on US base).


ఈ ఘటనపై అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్ స్పందించారు (Port Shuaiba Attack). మరణించిన సైనికుల కుటుంబాలకు, గాయపడిన వారికి, అమెరికా ప్రజలకు పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సైనిక స్థావరానికి కల్పించిన రక్షణ ఏర్పాట్లపై రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ వివరణ ఇవ్వాలని కోరారు. ఈ ఫిర్యాదుపై పెంటగాన్ నుంచి ఇంకా అధికారిక స్పందన రాలేదు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 17 , 2026 | 08:39 AM