అమరావతిపై అవే కుట్రలు!
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:36 AM
రాజధాని అమరావతిపై కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. భూసమీకరణ, సేకరణ ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయంటూ జగన్ పత్రిక అదే పనిగా విషం చిమ్ముతోంది.
ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు వరుస ఫిర్యాదులు
భూసమీకరణకు సహకరించనివారితో కలిసి కుట్రలు
భూసేకరణ, సమీకరణల్లో అక్రమాలంటూ గగ్గోలు
అమరావతికి ఆర్థిక సాయం రాకుండా చేయడమే లక్ష్యం
ఇప్పటికే జగన్ పత్రికకు పరువు నష్టం నోటీసు
అయినప్పటికీ వరుసగా తప్పుడు కథనాలు
అవే అడ్డగోలు రాతలు! అవే తప్పుడు ఫిర్యాదులు! రాజధాని అమరావతి నిర్మాణ పనులు గాడిన పడిన ప్రతిసారీ అవే కుయుక్తులు! ప్రపంచ బ్యాంకుకు, ఆసియా బ్యాంకుకు లేనిపోని ఆరోపణలతో ఫిర్యాదులు చేయడం... రాజధానికి ఆర్థిక సహాయం అందకుండా చేసేందుకు ప్రయత్నించడం! 2014-19 మధ్య భూసమీకరణ తర్వాత జరిగిందిదే! ఇప్పుడు జరుగుతున్నదీ ఇదే! తెరపైన కనిపించేది ఎవరైనా... తెరవెనుక ఉండి వారిని నడిపించేది మాత్రం వైసీపీ నేతలే!

(గుంటూరు (రాజధాని) - ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిపై కుట్రల పరంపర కొనసాగుతూనే ఉంది. భూసమీకరణ, సేకరణ ప్రక్రియల్లో అవకతవకలు జరిగాయంటూ జగన్ పత్రిక అదే పనిగా విషం చిమ్ముతోంది. అదే సమయంలో రాజధానికి ఆర్థిక చేయూత అందకుండా చేయడం లక్ష్యంగా ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీనికోసం అమరావతికి వ్యతిరేకంగా ఉన్న కొందరిని కలుపుకొని వైసీపీ కుట్రలను కొనసాగిస్తోంది. రాజధాని నిర్మాణం, అభివృద్ధికి కావాల్సిన నిధులను రాకుండా చేయడం ద్వారా అమరావతిని దెబ్బతీయాలనే దుర్బుద్ధితో పావులు కదుపుతోంది. అమరావతిలో భూసమీకరణ కింద భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించింది. ఈ ప్రక్రియ 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ఈ ప్లాట్ల కేటాయింపు సమయంలో కొన్ని ప్లాట్లు సమీకరణకు భూములివ్వని రైతుల భూముల్లోకి వచ్చాయి. ఈ విషయం గమనించిన పలువురు రైతులు తమకు కేటాయించిన ప్లాట్ల గురించి అప్పట్లోనే సీఆర్డీయే అధికారులకు తెలియజేశారు. అయితే వాటిని సరిదిద్దే క్రమం కొనసాగుతుండగానే, 2019లో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ పూర్తిగా పక్కకు వెళ్లిపోయింది. మళ్లీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక, తిరిగి ఈ అంశం తెరమీదకు వచ్చింది. వెంటనే సీఆర్డీయే యంత్రాంగం వాటిని సరిచేసే పనిలో పడింది. అయితే ఇప్పుడు ఇదే అంశాన్ని తిరిగి తెరమీదకు తెచ్చి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ)లకు రైతులతో ఫిర్యాదు చేయించడాన్ని వైసీపీ నాయకులు ఒక పనిగా పెట్టుకున్నారు.
తప్పుడు కథనాలతో తప్పుదారి..
రాజధాని ప్రాంత భూముల వ్యవహారంపై జగన్ మీడియా తప్పుడు కథనాలు వండి వార్చుతోంది. దీనిపై రాజధానిలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు కంచర్ల సాంబశివరావు జగన్ పత్రిక యాజమాన్యానికి ఇటీవలే రూ.10 కోట్లకు పరువు నష్టం దావానకు సంబంధించిన నోటీస్ ఇచ్చారు. గ్రామ కంఠం ముసుగులో భూసమీకరణ ప్రక్రియలో రూ. 12వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆ కథనంలో ఆరోపణలు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు భూమి ఇచ్చినందుకు నజరానాగా, ఆ భూమి ఇచ్చారంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా కథనాన్ని రాయడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘15 రోజుల్లో క్షమాపణ చెప్పాలి రూ. 10 కోట్లు పరిహారం చెల్లించాలి’ అంటూ ఆ పత్రిక యాజమాన్యానికి నోటీసులు పంపించారు. అయినప్పటికీ అవే తప్పుడు కథనాలతో అమరావతి ప్రతిష్ఠను, రాజధాని రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వైసీపీ చేస్తున్న ఈ కుట్రలపై రాజధాని గ్రామాల ప్రజలు భగ్గుమంటున్నారు. తప్పుడు కథనాలు ప్రచురించేవారిపై, దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
‘‘తప్పుడు కథనాలు ప్రచురించేవారిపై, తప్పుడు ఆరోపణలు చేసే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అనుసరిస్తున్న మెతక వైఖరి కారణంగానే వారు పదే పదే రెచ్చిపోతున్నారు. ఇకపై ఇలాంటి తప్పుడు కథనాలు రాస్తే పరువు నష్టం కేసులు మేమే పెడతాం.’’
- కంచర్ల జగన్మోహనరావు(గాంధీ)
అమరావతిని దెబ్బతీయడమే లక్ష్యం
‘‘గత రెండేళ్లుగా అమరావతి నిర్మాణం ఎంతో వేగంగా జరుగుతోంది. భూములిచ్చిన మాలాంటి రైతులకు అది ఎంతో భరోసాను ఇస్తోంది. రాజధాని నిర్మాణం పూర్తయితే అది రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉంటుంది. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ తప్పుడు ప్రచారాలతో అమరావతిని దెబ్బతీయాలని చూస్తోంది.’’
- రైతు ఇడుపులపాటి సీతారామయ్య
ఆర్థిక సహాయం రాకుండా చేయడానికే...:
‘‘రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణ సహాయం చేస్తోంది. ఈ సహాయం రాకుండా చేస్తే అమరావతి నిర్మాణం ఆగిపోతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే గత రెండున్నరేళ్లుగా అదే పనిగా ప్రపంచబ్యాంకు, ఏడీబీలకు వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు.’’
- రైతు నాయుడు శ్రీనివాసరావు

భూసమీకరణకు భూములివ్వనివాళ్లు తోడై..
‘‘రాజధానికి భూసమీకరణలో భూములు ఇవ్వకుండా అడ్డుకోవాలని చూసిన కొందరు ఇప్పుడు ప్రభుత్వం, సీఆర్డీయేపై ఫిర్యాదులు చేస్తున్నారు. వైసీపీ వీరి వెనుక ఉండి ఈ కుట్రలను నడిపిస్తోంది. రెండో విడత భూసమీకరణలోనూ వైసీపీ కొందరిని రెచ్చగొట్టింది. కానీ ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు ముందుకు వస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాలి’’ - వరలక్ష్మి, జేఏసీ నేత
ఇవి కూడా చదవండి..
స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
భారత్‌లో ఓ భిన్నమైన దృశ్యం కనిపించింది: ప్రిన్స్ విలియమ్