పరిగి బీజేపీ సారథి ఎవరు?
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:22 AM
పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు.
నడిపించే నాయకుడు లేక కార్యకర్తల్లో అయోమయం
మున్సిపల్ ఎన్నికల్లో ఉనికి చాటిన పార్టీ
గ్రూపులతో శ్రేణుల సతమతం
పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలంటున్న అభిమానులు
పరిగి(వికారాబాద్): పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి నాయకత్వ లోపం ఏర్పడింది. దేశంలో ఆ పార్టీకి అనుకూల పవనాలున్నా పరిగిలో మాత్రం పార్టీని నడిపే నాయకుడు లేకుండా పోయాడు. పార్టీలో ఏళ్లనుంచి కొనసాగుతున్న కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రచారం చేయకపోయినా కమలం గుర్తు 16వేలకుపైగా ఓట్లు సాధించించింది. లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఎక్కువ ఓట్లు సాధించింది. ఇటీవలి పురపాలక ఎన్నికల్లోనూ ఉనికి చాటింది. రెండు వార్డుల్లో గట్టి పోటీనిచ్చింది. కొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడారు. పోలైన ఓట్లలో తొమ్మిది శాతం(1,659) సాధించింది. అయితే నాయకత్వలోపం సమస్యగా మారిందని కార్యకర్తలు అంటున్నారు. గతంలో ఎప్పుడూ బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో పది వేలలోపే ఓట్లు పడేవి. అయితే క్రమంగా పార్టీ బలపడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.
ఎవరికి వారే కన్వీనర్!
పార్టీ జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్న కరణం ప్రహ్లాద్‌రావు పరిగికి చెందినాయనే. అయితే ఆయన పరిగిపై దృష్టి సారించడం లేదు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి సైతం తన పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పరిగిని పట్టించుకోవడం లేదని శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. నడిపించే నాయకుడు లేకుంటే పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నాయకత్వ లోపం, మరోవైపు ద్వితీయ శ్రేణి నాయకుల్లో గ్రూపులతో పార్టీకి నష్టం జరుగుతుంది. చాలా ఏళ్లుగా పరిగిలో సీనియర్ నేత కరణం ప్రహ్లాద్‌రావు పార్టీకి పెద్దదిక్కుగా కొనసాగారు.
ఇప్పుడాయన యాక్టీవ్‌గా పనిచేయడం లేదు. అలాగే వేముల పెంటయ్య, ఏవీ.రాములు, జి.శ్రీనివాస్, ఘణపూర్ వెంకటయ్యగౌడ్, రాముయాదవ్, బి.రాంచందర్‌లు పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బి.మారుతికిరణ్ పోటీ చేశారు. కేఎస్సార్ ట్రస్ట్ చైర్మన్ కె.శరత్‌కుమార్‌రెడ్డి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. బృంగి హరికృష్ణ సైతం బీజేపీలో చేరారు. అసెంబ్లీ కన్వీనర్‌గా ఇద్దరు, ముగ్గురు నాయకులు తామే కన్వీనర్ అని చెప్పుకుంటూ గ్రూపు నాయకులుగా కొనసాగుతున్నారు. పార్టీ బలపడుతున్న తరుణంగా గ్రూపులతో నష్టం వాటిల్లుతుందని కార్యకర్తలు, పార్టీ అభిమానులు వాపోతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
యుద్దం కాదు.. శాంతిని కోరుకుందాం
Read Latest Telangana News and National News