తవ్వుకో.. అమ్ముకో..!

ABN , First Publish Date - 2023-05-24T01:26:15+05:30 IST

అసలే వేసవికాలం. పైగా చెరువులో చుక్క నీరు లేదు. ఏం చేసినా అడిగే దిక్కు లేదు. వైసీపీ నాయకులు ఇదే అదునుగా భావించారు. ఎటువంటి అనుమతులూ లేకుండా చెరువులో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇటుక బట్టీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను పెట్టి జోరుగా మట్టి తరలించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

తవ్వుకో.. అమ్ముకో..!

ముత్యాలమ్మ చెరువులో అక్రమంగా మట్టి తోలకాలు

ట్రాక్టర్‌ ట్రక్కు రూ.500 చొప్పున ఇటుక బట్టీలకు మట్టిని అమ్ముకుంటున్న వైసీపీ నాయకులు

రెండు ప్రొక్లెయిన్‌లు, 50 ట్రాక్టర్లతో రవాణా

పట్టించుకోని ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు

ఎమ్మెల్యే అండదండలతో రెచ్చిపోతున్న అక్రమార్కులు

అసలే వేసవికాలం. పైగా చెరువులో చుక్క నీరు లేదు. ఏం చేసినా అడిగే దిక్కు లేదు. వైసీపీ నాయకులు ఇదే అదునుగా భావించారు. ఎటువంటి అనుమతులూ లేకుండా చెరువులో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఇటుక బట్టీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను పెట్టి జోరుగా మట్టి తరలించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్‌, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

మైలవరం రూరల్‌ : మైలవరం మండలంలోని పుల్లూరు శివారు చిలుకూరువారిగూడెం ముత్యాలమ్మ చెరువులో రెండు ఎక్స్‌కవేటర్లతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. 50 ట్రాక్టర్లతో రెండ్రోజులుగా అడ్డూఅదుపూ లేకుండా ఇటుక బట్టీలకు తరలించేస్తున్నారు. ఒక్కో ట్రిప్పు మట్టిని రూ.500 నుంచి వెయ్యి రూపాయలకు అమ్ముకుంటున్నారు. వైసీపీ నాయకుడు వేల ట్రిప్పుల మట్టిని ఆర్‌అండ్‌బీ రహదారి పక్కనే ఉన్న తన సొంత స్థలంలో పెద్దఎత్తున నిల్వ చేస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా పట్టపగలే జరుగుతున్నా అటువైపు ఇరిగేషన్‌, మైనింగ్‌ అధికారులు కన్నెత్తి చూడటకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముత్యాలమ్మ చెరువులో ఆ గ్రామ వైసీపీ నాయకుడి కనుసన్నల్లో మట్టి తోలకాలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే చెరువు చాలా లోతుకు తవ్వేశారు. చెరువు లోతు పెరగడంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చెరువు నిండా నీరు ఉన్నా తూముల ద్వారా రబీ సీజన్‌లో పంట పొలాలకు పెట్టుకోవడం వీలుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్ట అంచున ఉన్న మట్టిని సైతం తరలిస్తుండటంతో కట్ట బలహీనపడుతోందని ఆందోళన చెందుతున్నారు. సోమవారం సాయంత్రం గ్రామంలో సొసైటీ భవన నిర్మాణ శంకుస్థాపనకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు వస్తున్నప్పటికీ వైసీపీ నాయకుడు మట్టి రవాణాను జోరుగా సాగించాడు. ఎమ్మెల్యే అండదండలతోనే వైసీపీ నాయకుడు మట్టి తోలకాలు జరుపుతున్నట్టు పలువురు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖల నుంచి ఎటువంటి అనుమతులూ తీసుకోకపోయినా వేల ట్రిప్పుల మట్టిని బట్టీలకు తరలించడంపై పుల్లూరు పంచాయతీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామంలోని సహజ వనరులన్నింటినీ అధికార పార్టీ నాయకుడు అక్రమంగా అమ్ముకోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్‌, మైనింగ్‌ శాఖల ఉన్నతాధికారులు స్పందించి మట్టి అక్రమ తోలకాలు జరుపుతున్న వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-05-24T01:26:15+05:30 IST