ఓ ఫొటో మీ జీవితాన్నే మార్చేస్తుంది.. అధ్యయనంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
ABN , Publish Date - Mar 11 , 2026 | 08:00 AM
అక్రోమెగలీ కారణంగా చేతులు, కాళ్లు పెద్దవైపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. జీవిత కాలం 10 సంవత్సరాలు తగ్గిపోతుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: అక్రోమెగలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఇదొక సీరియస్ హార్మోన్ డిజార్డర్. శరీరంలో సాధారణం కంటే ఎక్కువగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అయినపుడు ఈ డిజార్డర్ వస్తుంది. సాధారణంగా ఈ డిజార్డర్ మధ్య వయస్సు వారికి వస్తూ ఉంటుంది. అక్రోమెగలీ కారణంగా చేతులు, కాళ్లు పెద్దవైపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. జీవిత కాలం 10 సంవత్సరాలు తగ్గిపోతుంది. ఎంతో ప్రమాదకరమైన, అరుదైన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించటం చాలా కష్టం.
ఎందుకంటే.. లక్షణాలు చాలా స్లోగా అభివృద్ధి చెందుతాయి. టెస్టుల్లో ఈ డిజార్డర్ బయటపడాలంటే ఏళ్ల సమయం పడుతుంది. జపాన్‌కు చెందిన కోబే యూనివర్సిటీ ఈ డిజార్డర్‌పై పరిశోధనలు చేసింది. ఒక ఫొటో ద్వారా డిజార్డర్‌ను కనుగొనేలా ఏఐ మోడల్‌ను ట్రైన్ చేసింది. ఇందుకోసం కోబే యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం 725 మందిపై పరిశోధనలు చేసింది. వీరిలో సగ భాగానికి పైగా అక్రోమెగలీ ఉంది. వీరి చేతులకు సంబంధించిన 11 వేల ఫొటోలను తీసి ఏఐ మోడల్‌ను ట్రైన్ చేశారు. ట్రైనింగ్ తర్వాత ఆ ఏఐ మోడల్ విజయవంతంగా ఫొటోల ద్వారా అక్రోమెగలీని గుర్తించటం మొదలెట్టింది.
88 శాతం కేసుల్లో ఏఐ మోడల్ విజయవంతంగా అక్రోమెగలీని గుర్తించింది. ఎంతో అనుభవం ఉన్న ఎండోక్రినాలజిస్టుల కంటే అద్భుతంగా ఏఐ మోడల్ పని చేసింది. ఫొటోల ద్వారా ఏఐ మోడల్ కచ్చితత్వంతో అక్రోమెగలీని గుర్తించటంపై శాస్త్రవేత్తల బృంద నాయకుడు యుక ఓహ్‌మాచీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, ఏఐ మోడల్ డాక్టర్లను ఏమాత్రం రీప్లేస్ చేయలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. కాగా, ప్రతీ లక్ష మందిలో 8 నుంచి 24 మంది అక్రోమెగలీ బారిన పడుతున్నారు. చేతులు, కాళ్ల వాపు.. తలనొప్పి.. ముఖంలో మార్పులతో ఇబ్బందిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం పేరుతో యువకుడికి టోకరా
ఇరాన్‌లో నల్లటి వర్షం.. ఇది ఎంత ప్రమాదకరమంటే..