Share News

తవ్వుకో.. అమ్ముకో..!

ABN , Publish Date - Mar 11 , 2026 | 10:47 AM

జహీరాబాద్‌ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు.

తవ్వుకో.. అమ్ముకో..!

  • జహీరాబాద్‌లో రెచ్చిపోతున్న మైనింగ్‌ మాఫియా

  • కళ్లముందే కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసం

  • యథేచ్ఛగా మట్టి, ఎర్రరాయి తవ్వకాలు

  • పట్టించుకోని అధికార యంత్రాంగం

జహీరాబాద్‌(సంగారెడ్డి): జహీరాబాద్‌ ప్రాంతంలో సహజసంపదను కొల్లగొట్టేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎర్రరాయి, మట్టిని అమ్ముకుని సొమ్ము చేసుకునే క్రమంలో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారు. నిరోధించాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

నిబంధనలకు పాతర

అక్రమార్కులు నిత్యం లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లలో సహజసంపదను తరలిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉన్న రోజుల్లో ఈ తవ్వకాలు మరింత ఉద్ధృతం అవుతుంటాయి.


న్యాల్‌కల్‌, కోహీర్‌, మొగుడంపల్లి వంటి మండలాల్లోని న్యామ్తాబాద్‌, కల్‌బేమల్‌, హద్నూర్‌, గణే్‌షపూర్‌, కాశీంపూర్‌, ఆనెగుంట,హోతి(కే), చిన్నహైదరాబాద్‌, చున్నంబట్టి తండా, మొగుడంపల్లి, పర్వతాపూర్‌. మిర్జంపల్లి, జాడిమల్కాపూర్‌, పడియాల్‌ తండా, ఉప్పర్‌పల్లి, మన్నాపూర్‌, విట్టునాయక్‌ తండా, శేఖాపూర్‌, పిచేర్యాగడి, వెంకటాపూర్‌, బడంపేట తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. కొందరు అక్రమార్కులు రైతులకు డబ్బు ఆశజూపి భూములను లీజుకు తీసుకుని 50 నుంచి 100 అడుగుల లోతు వరకు గుంతలు తవ్వి రాయిని తరలిస్తున్నారు. ఒక్కో రాయి రూ.15-20 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.


sdp2.2.jpgనిత్యం ప్రాణాలతో చెలగాటం

తవ్వకాలు పూర్తయ్యాక ఆ గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వర్షాకాలంలో ఈ భారీ గుంతలు నీటితో నిండిపోయి, పశువులను మేపుకోవడానికి వెళ్లే కాపరులు, మూగజీవాలు పడి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం. రాత్రి వేళల్లో మట్టి తరలింపు, పగలు ఎర్రరాయి రవాణా నిరాటంకంగా సాగుతున్నా, రాత్రిపూట దాడులకు వెళ్తే ప్రమాదమని భావించిన అధికారులు కిమ్మనడం లేదు. మరోవైపు, హోతి, దిడిగి శివారుల్లో అక్రమ ఇటుకబట్టీలు కూడా జహీరాబాద్‌కు కూతవేటు దూరంలో వెలసి, పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి.


కఠిన చర్యలు తప్పవు

ఎర్రరాయి తవ్వకాలు, ఇటుకబట్టీల నిర్వాహణ, మట్టి తరలింపు మా దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా సహజసంపదను దోపిడీ చేసే ఎవరినీ ఉపేక్షించేది లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటాం.

-దశరత్‌, జహీరాబాద్‌ తహసీల్దార్‌


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం, వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

‘రాయనపాడు’ రాజసం!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 11 , 2026 | 10:51 AM