నిజామాబాద్ జిల్లాలో హై టెన్షన్.. కాంగ్రెస్ నేత వినయ్ రెడ్డి హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Jul 20 , 2026 | 07:41 AM
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సోమవారం పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
నిజామాబాద్ జిల్లా, జులై 20 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) పార్టీల నేతలు ఈరోజు(సోమవారం) పోటాపోటీ కార్యక్రమాలతో అంకాపూర్ గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి (BJP MLA Rakesh Reddy) నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆయన నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. అంకాపూర్‌లోని బీజేపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమవుతుండగా, వచ్చిన వారికి సమాధానం చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కూడా అంకాపూర్‌లోని తన నివాసంలోనే ఉంటానని స్పష్టం చేశారు.
రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆర్మూర్ పరిధిలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 అమలు చేస్తూ ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన పలువురు కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా, అంకాపూర్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పార్టీ శ్రేణులతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన ఇంటి వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలోకి వచ్చే మార్గాల వద్ద కూడా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాల నేపథ్యంలో అంకాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
అయోధ్య విరాళాల వివాదం.. కేంద్రానికి ఖర్గే, రాహుల్ లేఖ
గాంధీభవన్ చుట్టూ తిరిగితే కుదరదు.. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి క్లాస్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌కి ఈశ్వరమ్మ లేఖ.. ఎందుకంటే
Read Latest AP News And Telangana News And National News
And Telugu News