హుండీ లెక్కింపు ఉద్యోగాలంటూ రూ.20 కోట్ల దోపిడీ
ABN , Publish Date - May 03 , 2026 | 11:05 AM
నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది.
నల్గొండ జిల్లా, మే3 (ఆంధ్రజ్యోతి): నల్గొండ జిల్లాలో నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఒక ముఠా అత్యంత నమ్మశక్యంగా భారీ మోసానికి పాల్పడింది. దేవాలయాల్లో హుండీ లెక్కింపు చేసే ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సుమారు వెయ్యి మందికి పైగా యువతీ యువకులను బురిడీ కొట్టించింది. సుమారు రూ.20 కోట్లకు పైగా వసూలు చేసిన ఉదంతం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై నల్లగొండ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేవాలయాల్లో ఉద్యోగాల పేరుతో..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పులి రవి ఈ భారీ స్కామ్‌కు ఏజెన్సీ నిర్వాహకుడిగా వ్యవహరించాడని తెలిపారు. నల్గొండ జిల్లాలోని నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వంతో సంబంధం ఉన్న దేవాలయాల్లో పర్మనెంట్ లేదా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో హుండీ లెక్కింపు పనులు కేవలం తమ ఏజెన్సీకే దక్కాయని, అందులో పనిచేయడానికి సిబ్బంది కావాలని ప్రకటనలతో ప్రచారం చేశాడు.
'శాలరీ బాక్స్' యాప్ మాయాజాలం..
బాధితులకు తాము నిజంగానే ఉద్యోగంలో చేరామనే భ్రమ కల్పించడానికి పులి రవి ఒక వినూత్నమైన పంథాను అనుసరించాడు. ఇందుకోసం సాంకేతికతను వాడుకుని నిరుద్యోగులను నమ్మించాడు. ‘శాలరీ బాక్స్’ అనే పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను క్రియేట్ చేయించాడు. అభ్యర్థులు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఈ యాప్ ద్వారా అటెండెన్స్ నమోదు చేయాలని రూల్ పెట్టాడు. దీనివల్ల బాధితులు తాము నిజంగానే డ్యూటీ చేస్తున్నామని నమ్మారు. నిరుద్యోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న రవి, ఉద్యోగం గ్యారెంటీ అని నమ్మించడానికి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేశాడు.
యాప్ డౌన్‌లోడ్ ఛార్జీ..
విచిత్రమేమిటంటే, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అవ్వడానికి కూడా ఒక్కొక్కరి నుంచి రూ. 5,000 వసూలు చేయడం రవి తెలివితేటలకు నిదర్శనం. నెలలు గడుస్తున్నా జీతాలు రాకపోవడం, దేవాలయ అధికారులను సంప్రదించినప్పుడు అసలు అలాంటి ఏజెన్సీకే కాంట్రాక్ట్ ఇవ్వలేదని తెలియడంతో బాధితులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాము కట్టిన లక్షలాది రూపాయలు తిరిగి రాకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏ ప్రభుత్వ దేవాలయం లేదా దేవాదాయ శాఖ ఇలాంటి ప్రైవేట్ యాప్‌ల ద్వారా లేదా లక్షల రూపాయల డిపాజిట్లతో ఉద్యోగాలు ఇవ్వదని పోలీసులు తెలిపారు. ఇలాంటి ప్రకటనలు నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రుణమాఫీ చారాణ చేసి.. బారాణ ఎగ్గొట్టింది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు సెటైర్లు
తండ్రిని విమర్శించడం కవితకు తగదు: దానం నాగేందర్
Read Latest Telangana News And AP News And International News And Telugu News