సూర్యాపేట జిల్లాలో దారుణం.. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ భర్త హత్య
ABN , Publish Date - May 23 , 2026 | 07:04 AM
సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.
సూర్యాపేట జిల్లా, మే 23 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ మౌనిక భర్త చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోనే హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేసి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనతో యర్కారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో కొనసాగుతున్న పాత రాజకీయ విభేదాలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చింతలపాటి మధు భార్య మౌనిక బీఆర్ఎస్ తరఫున గ్రామ సర్పంచ్‌గా గతంలో పనిచేశారు. గ్రామ రాజకీయాల్లో వారి కుటుంబానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉండేది. అయితే కొంతకాలంగా గ్రామంలో రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మధు హత్య చోటుచేసుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇదే గ్రామంలో 2020 ఫిబ్రవరిలో అప్పటి బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న కూడా దారుణ హత్యకు గురైన విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే గ్రామంలో మరో రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి హత్యకు గురికావడంతో యర్కారం గ్రామంలో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి.
గ్రామ ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస రాజకీయ హత్యలతో గ్రామంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డ్: మంత్రి ఉత్తమ్
కేజీ బేసిన్ గ్యాస్ వివాదం.. రిలయన్స్‌కు సుప్రీంకోర్టులో షాక్
Read Latest Telangana News And AP News And International News And Telugu News