Share News

చుక్క నీటితో చక్కటి దిగుబడి

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:23 PM

వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సైతం ఆధునిక సాగు పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు.

చుక్క నీటితో చక్కటి దిగుబడి
Drip Irrigation

  • డ్రిప్‌, స్ర్పింక్లర్ల వినియోగంతో నీటి పొదుపు

  • మల్చింగ్‌ తో బీర,కాకర, సొర సాగు

  • తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి

  • కూరగాయల సాగులో వెంకటాపూర్‌ రైతులు ఆదర్శం

నంగునూరు(మెదక్): వ్యవసాయంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు సైతం ఆధునిక సాగు పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ పంటల సాగుతో పాటు తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే ఆరుతడి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా మల్చింగ్‌, డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాలను అందిపుచ్చుకుంటూ కూరగాయల సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు నంగునూరు మండలం వెంకటాపూర్‌ గ్రామ రైతులు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ వ్యవసాయంలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.


మల్చింగ్‌ విధానంతో బీర సాగు

మండలంలోని వెంకటాపూర్‌ లో రైతులు ప్రధానంగా బీర, కాకర, సొరకాయ తదితర కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బీర సాగులో మల్చింగ్‌ విధానాన్ని అనుసరిస్తూ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. పంట చేలలో నేలపై మల్చింగ్‌ షీట్లు ఏర్పాటుచేయడం వల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీంతో నీటి వినియోగం తగ్గడంతో పాటు కలుపు మొక్కల పెరుగుదలను కూడా నియంత్రించేందుకు వీలవుతోంది. డ్రిప్‌ పైపుల ద్వారా మొక్కల మొదళ్లకు నేరుగా నీటిని అందిస్తూ నీటిని పొదుపు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పంట నిర్వహణ సులభతరమవడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునే అవకాశం ఉంటుందని రైతులు భావిస్తున్నారు.


zz.jpgవరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు

ప్రస్తుతం నీటి వనరుల లభ్యత, పెట్టుబడులు, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారిస్తున్నారు. వరి సాగుతో పోలిస్తే ఆరుతడి పంటలైన బీర, కాకర, సొరకాయ వంటి కూరగాయల సాగు ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని రైతులు ఆసక్తి చూపుతున్నారు. పంట కాలం, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా కూరగాయలను సాగుచేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ రకాల కూరగాయలను సాగుచేయడం ద్వారా వ్యవసాయంలో నష్టభయాన్ని తగ్గించుకోవచ్చని భావిస్తున్నారు.


బీడు భూముల్లోనూ పచ్చని పంటలు

వెంకటాపూర్‌ గ్రామానికి కూరగాయల సాగులో ప్రత్యేక గుర్తింపు ఉంది. మండలంలోనే అధికంగా కూరగాయలు సాగుచేసే గ్రామంగా పేరుగాంచింది. గతంలో సాగుకు అనుకూలంగా లేవని భావించిన బీడు భూములను సైతం రైతులు సాగులోకి తీసుకొస్తున్నారు. ఆధునిక పద్ధతులను వినియోగిస్తూ డ్రిప్‌, స్ర్పింక్లర్ల సాయంతో పంటలు పండిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ సాగును విస్తరిస్తున్నారు. రైతుల పట్టుదల, కొత్త పద్ధతులను స్వీకరించే ఆసక్తి గ్రామంలో కూరగాయల సాగు విస్తరణకు దోహదపడుతోంది.


zzz.jpgప్రభుత్వ ప్రోత్సాహం అందితే మరింత అభివృద్ధి

కూరగాయల సాగుపై ఆసక్తి ఉన్నప్పటికీ మల్చింగ్‌ పేపర్లు, డ్రిప్‌ పరికరాలు, స్ర్పింక్లర్లు, ఇతర వ్యవసాయ సామగ్రి కొనుగోలుకు రైతులకు పెట్టుబడి అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీ పథకాల ద్వారా రైతులకు మరింత చేయూత అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు అవసరమైన పరికరాలను రాయితీపై అందిస్తే మరింత మంది రైతులు కూరగాయల సాగువైపు మొగ్గుచూపుతారని చెబుతున్నారు. మార్కెటింగ్‌ సదుపాయాలు, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.


ఆదర్శంగా నిలుస్తున్న వెంకటాపూర్‌ రైతులు

మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి పొదుపు, ఆధునిక సాంకేతికత వినియోగం ఎంత ముఖ్యమో వెంకటాపూర్‌ రైతులు తమ సాగు విధానంతో చాటిచెబుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇతర గ్రామాల రైతులకు సైతం ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రోత్సాహం, సబ్సిడీలు అందితే గ్రామంలో కూరగాయల సాగు మరింత విస్తరించి రైతుల ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో 624 మంది రైతులు సుమారు 214 ఎకరాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారని వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక పేర్కొన్నారు. మొదటి నుంచి గ్రామంలో రైతులు తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిన పంటలపైనే ఆసక్తి చూపుతారని ఆమె చెప్పారు. యాసంగిలో వరికి బదులు ఆరతడి పంటలపై దృష్టి సారించి రైతులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొండగట్టు అంజన్నకు చందనోత్సవం.. 60 ఏళ్ల తరువాత వేడుకలు

బీఆర్‌ఎస్‌ గుర్తింపు రద్దు చేయాలి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 04 , 2026 | 01:29 PM