రేషన్ బియ్యం దందా.. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్రమ రవాణా
ABN , Publish Date - Nov 25 , 2026 | 11:56 AM
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది.
రూ.20కి కొనుగోలు.. రూ.35కు విక్రయం
ఇతర రాష్ట్రాలకు తరలుతున్న సన్నబియ్యం
గోదాముల్లో 14,500 క్వింటాళ్ల నిల్వలు
హత్నూర(సంగారెడ్డి): పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రేషన్ బియ్యం అక్రమ కొనుగోళ్లు, రవాణా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. పల్లెల్లో ఇంటింటికీ తిరుగుతూ తక్కువ ధరకు బియ్యాన్ని సేకరిస్తున్న దళారులు, వాటిని రైస్ మిల్లులకు, పరిశ్రమలకు తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాల్లో దళారులు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై వీధుల్లో తిరుగుతూ రేషన్ కార్డుదారుల నుంచి కిలో రూ.20 చొప్పున బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిల్వ చేసి, అక్కడి నుంచి రైస్ మిల్లులకు కిలో రూ.35 వరకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. హత్నూర మండలంలో భువనగిరి జిల్లాకు చెందిన పలువురు వ్యక్తులు ప్రత్యేకంగా ఆటోలు కొనుగోలు చేసి మరీ గ్రామాల్లో తిరుగుతూ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
సన్నబియ్యం రాకతో పెరిగిన డిమాండ్
తెలంగాణ ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తుండటంతో బహిరంగ మార్కెట్‌లో వీటికి డిమాండ్ ఏర్పడింది. దళారులు సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లులకు, మద్యం తయారీ (బేవరేజెస్), పౌలీ్ట్ర ఫారాల్లో కోళ్ల దాణా, గమ్ తయారీ పరిశ్రమలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొందరు దళారులు అంతర్ రాష్ట్ర ముఠాలతో కుమ్మక్కై బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్నట్లు తెలుస్తున్నది. లాభాలు అధికంగా ఉండటంతో దళారులు గ్రామాల్లో యథేచ్ఛగా బియ్యం సేకరణను ముమ్మరం చేశారు.
గోదాముల్లో 14,500 క్వింటాళ్ల నిల్వలు
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇలా పట్టుబడిన బియ్యాన్ని నారాయణఖేడ్, జోగిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్‌చెరులోని సివిల్ సప్లై గోదాముల్లో భద్రపరిచారు. ప్రస్తుతం ఈ గోదాముల్లో 14,500 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలో అధికారికంగా టెండర్లు పిలిచి బహిరంగ వేలం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన బేవరేజెస్ లైసెన్స్‌దారులకు టెండర్ల ద్వారా వీటిని విక్రయించనున్నారు. అక్రమ రవాణాలో పట్టుబడిన వాహనాలను ఆయా పోలీస్ స్టేషన్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీగా బియ్యం పట్టుబడటం జిల్లాలో అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టం చేస్తోంది. గ్రామాల్లో బహిరంగంగానే కొనుగోళ్లు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కాసుల కోసం కక్కుర్తి.. నేరస్థులతో దోస్తీ
Read Latest AP News And Telangana News And International News And Telugu News