Share News

కీలక పరిణామం.. దలై లామాకు కేంద్ర ప్రభుత్వ భవనం కేటాయింపు

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:24 AM

టిబెట్ బౌద్ధమత గురువు దలై లామా వారసుడి ఎంపిక నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దలై లామా నివాసం ఉండేందుకు ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో ఓ బంగళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తోంది.

కీలక పరిణామం.. దలై లామాకు కేంద్ర ప్రభుత్వ భవనం కేటాయింపు
Dalai Lama

ఇంటర్నెట్ డెస్క్: టిబెట్ బౌద్ధమత గురువు దలై లామా వారసుడి ఎంపిక నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దలై లామా నివాసం ఉండేందుకు ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో ఓ బంగళాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్టు తెలుస్తోంది. దలై లామా కార్యాలయం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు ఈ భవనాన్ని కేటాయించారు. విదేశాంగ శాఖ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పండిట్ రవి శంకర్ శుక్లా రోడ్డులో ఈ భవనం ఉంది.


ఈ విషయమై కేంద్ర హౌజింగ్, అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. అయితే, నివాసం కేటాయింపునకు అనుమతి వచ్చేసినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా ఇలాంటి వసతులను మూడేళ్ల కాలపరిమితిపై కేటాయిస్తారు. అవసరమనుకుంటే మరింత కొంతకాలం కాలపరిమితిని పొడిగించే అవకాశం కూడా ఉంది. దైలా లామా వ్యవస్థను కాపాడటం, ఆయన ఆధ్యాత్మిక కృషిని కొనసాగించడమే తమ లక్ష్యమని గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.


తదుపరి దలై లామాగా తాము చెప్పిన వ్యక్తినే ఎంపిక చేయాలని చైనా పట్టుబడుతున్న విషయం తెలిసిందే. అయితే, గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టు మాత్రం చైనా వాదనలను తోసిపుచ్చుతోంది. తదుపరి టిబెట్ బౌద్ధమత గురువు ఎంపికపై పూర్తి అధికారాలు తమవేనని వాదిస్తోంది. అమెరికా కూడా చైనా వాదనలను తిరస్కరిస్తోంది. టిబెట్ వ్యవహారాల్లో చైనా జోక్యాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని అక్కడి కాంగ్రెషనల్ (చట్టసభలు) కమిటీ ఒకటి కోరింది. ఈ విషయంలో భారత్‌తో కూడా సంప్రదింపులు జరపాలని సూచించింది. ఈ నేపథ్యంలో దలై లామాకు కేంద్ర ప్రభుత్వ అధికారిక భవనం కేటాయింపు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


ఈ వార్తలనూ చదవండి:

విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు

ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు

Updated Date - Nov 25 , 2026 | 11:51 AM