దిగి వచ్చిన బియ్యం ధరలు
ABN , Publish Date - Nov 25 , 2026 | 03:38 AM
బియ్యం ధరలు మొత్తానికి దిగివచ్చాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గటంతో నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ. 10 చొప్పున తగ్గాయి.
కిలోకు సగటున రూ.10 చొప్పున తగ్గుదల
బీపీటీ బియ్యం కిలో రూ. 66.. ఫలించిన సర్కారు చర్యలు
వినియోగదారులకు ఊరట.. ఆన్‌లైన్‌లో మాత్రం పాత ధరలే
దీనిపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న ప్రజలు
హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): బియ్యం ధరలు మొత్తానికి దిగివచ్చాయి. మార్కెట్లో డిమాండ్ తగ్గటంతో నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ. 10 చొప్పున తగ్గాయి. ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టడం, బియ్యం ధరలను ప్రకటించి షాపుల్లో బోర్డులు ఏర్పాటు చేయించటం, అక్రమ నిల్వలపై పౌరసరఫరాలశాఖ అధికారులు పెద్దఎత్తున దాడులు నిర్వహించటం.. ఈ చర్యలతో రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల దందాకు బ్రేక్ పడింది. ధరలు తగ్గాయి. ప్రస్తుతం బియ్యం దుకాణాలు, మిల్లుల ఎదుట క్యూలు, హడావిడి లేకుండా ప్రశాంతంగా అమ్మకాలు జరుగుతున్నాయి.
ధరలు తగ్గటంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా, ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ లో సాగు విస్తీర్ణం తగ్గటం, తద్వారా వరి ఉత్పత్తి, దిగుబడి కూడా తగ్గుతుందనే అంచనాల నేపథ్యంలో నెల రోజుల క్రితం రైస్‌మిల్లర్లు, దళారులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా బియ్యం ధరలు పెంచారు. వాస్తవానికి ఎల్‌నినో ప్రభావం ఇప్పటికిప్పుడు బియ్యం నిల్వలు, ధరలపై ఉండదు. యాసంగి సీజన్‌లో పంటలు పండకపోతే... ఆ తర్వాత బియ్యం కొరత ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లోనే బియ్యం ధరలపై ప్రభావం పడుతుంది. కానీ, ఖరీఫ్ సీజన్‌లో ఉత్పత్తి చేసిన ధాన్యం, బియ్యం ఇంకా చేతికిరాకముందే... మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించారు. ఇప్పుడు బియ్యం కొనకపోతే... 7-8 నెలల దాకా బియ్యం దొరకవనే వాతావరణాన్ని సృష్టించారు. దీంతో బియ్యం ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.
సన్నబియ్యాన్ని వ్యాపారులు కిలోకు రూ.100 చొప్పున కూడా అమ్మి సొమ్ము చేసుకున్నారు. ప్రజలు ఆందోళనకు గురి కావటంతో, ప్రభుత్వం నియంత్రణ చర్యలకు దిగింది. వినియోగదారులు ఎక్కువగా కొనే సన్నబియ్యానికి ధరలు ప్రకటించింది. బీపీటీ, కేఎన్‌ఎం(కూనారం) సన్నాలను కిలోకు రూ.66 మించి, తెలంగాణసోనా/ఆర్‌ఎన్‌ఆర్ రకాలను రూ.74కు మించి, హెచ్‌ఎంటీ, జైశ్రీరామ్ బియ్యాన్ని కిలోకు రూ.79కి మించి అమ్మొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ధరల పట్టిక పోస్టర్లను మార్కెట్లో ఉన్న అన్ని షాపుల ముందు అంటించేలా చర్యలు తీసుకొని, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కేసులు కూడా నమోదు చేసింది. దీంతో ధరలు అదుపులోకి వచ్చాయి. వివిధ రకాలపై సగటున కిలోకు రూ.10 మేర ధరలు తగ్గాయి.
బీపీటీ బియ్యాన్ని కిలోకు రూ.54 నుంచి రూ.60 లోపే రైస్‌మిల్లర్లు అమ్ముతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన ధర కిలోకు రూ.66 ఉండటంతో... వ్యాపారులు కూడా అదే ధరకు విక్రయిస్తున్నారని, ఇటువంటి వాటి ధరలను సవరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పాత, కొత్త బియ్యం ధరలకు మధ్య వ్యత్యాసం కొనసాగుతోంది. మార్కెట్ ధరలతో పోల్చితే ఆన్‌లైన్‌లో బియ్యం ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. మార్కెట్లో ధరల నియంత్రణ చేపట్టినట్లుగానే... ఆన్ లైన్ బియ్యం ధరలకు కూడా కళ్లెం వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ధాన్యం ధరల తగ్గుదల ప్రభావం
ఈసారి వరికోతల సీజన్ మొదలుకాగానే ధాన్యానికి డిమాండ్ పెరిగింది. 20 నుంచి 25 శాతం తేమ ఉన్న పచ్చి ధాన్యాన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఒక దశలో క్వింటాలు సన్న ధాన్యం ధర రూ.4 వేలకు చేరుకుంది. ధాన్యం మార్కెట్లోకి వస్తున్న కొద్దీ... ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇది కూడా బియ్యం ధరల తగ్గుదలకు కారణమైంది. కాగా, ఇప్పటి వరకూ బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో రేషన్ బియ్యానికి డిమాండ్ పెరిగింది. నవంబరు నెలలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు భారీమొత్తంలో తీసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మారిషస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ