Share News

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:34 PM

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ తన చిన్ననాటి ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో తన బాబాయి సంజయ్ గాంధీని దొంగ అని అన్నాడనే కోపంతో ఓ బాలుడిని చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించారు.

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ
MP Priyanka Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీ తన చిన్ననాటి ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకున్నారు. పాఠశాలలో తన బాబాయి సంజయ్ గాంధీని దొంగ అని అన్నాడనే కోపంతో ఓ బాలుడిని చెంపదెబ్బ కొట్టినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ అనంతరం తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీతో జరిగిన సంభాషణలో ప్రియాంక ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ కూడా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.


1977లో ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోయిందని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఆ తర్వాత తమ కుటుంబం మరో ఇంటికి మారాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉండేవని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల తర్వాత పాఠశాలకు వెళ్లిన తొలి రోజుల్లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె వివరించారు. ఓ విద్యార్థి తన వద్దకు వచ్చి.. 'నీ బాబాయి సంజయ్ గాంధీ జైలులో ఉన్నాడు.. ఆయన ఓ దొంగ' అంటూ ఎగతాళి చేశాడని చెప్పారు. ఆ మాటలు వినగానే తనకు ఎంతో కోపం వచ్చిందని, వెంటనే ఆ బాలుడి చెంపపై కొట్టానని ప్రియాంక వెల్లడించారు. దీంతో ఆ విద్యార్థి ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లాడని, చివరకు తనకు టీచర్ నుంచి చివాట్లు పడ్డాయని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.


ఇదే సంభాషణలో రాహుల్ గాంధీ కూడా తన పాఠశాల రోజుల జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనంలో తనకు, ప్రియాంకకు మధ్య చాలా తేడా ఉండేదని చెప్పారు. ప్రియాంక పాఠశాల నిబంధనలను పాటిస్తూ క్రమశిక్షణతో ఉండేవారని పేర్కొన్నారు. అయితే, తాను మాత్రం తరచూ ప్రశ్నలు అడుగుతూ, నిబంధనలను ప్రశ్నించే స్వభావంతో ఉండేవాడినని తెలిపారు. ఎమర్జెన్సీ తర్వాత పాఠశాలకు వెళ్లినప్పుడు తన పక్కన కూర్చోవడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదని రాహుల్ వెల్లడించారు. తన ఏడో పుట్టినరోజు వేడుకకూ ఒక్క స్నేహితుడు మినహా మిగతావారెవరూ హాజరు కాలేదని చెప్పారు. ఇలా తమ చిన్ననాటి అనుభవాలను తల్లి సోనియా గాంధీతో కలిసి సరదాగా గుర్తుచేసుకున్నారు.


కాగా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య జరిగిన ఈ సంభాషణ వీడియోను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో తమ కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన జ్ఞాపకాలను ముగ్గురూ పంచుకున్నారు. సోనియా గాంధీ రచించిన 'Belonging: A Journey of Love' పుస్తకం విడుదల నేపథ్యంలో ఈ వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి

భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌లు నిషేధం

యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఇవ్వడానికి ఓకే: ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్

Updated Date - Nov 24 , 2026 | 04:34 PM