యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 26 సీట్లు ఇవ్వడానికి ఓకే: ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్
ABN , Publish Date - Nov 24 , 2026 | 03:21 PM
వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై ఇండి కూటమి పక్షాలు చర్చలు జరుపుతున్నాయి. తమకు 100 నుంచి 120 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. 26 సీట్లు ఇస్తామని సమాజ్వాది పార్టీ ప్రతిపాదనలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 26 సీట్లు ఇస్తామని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనలు చేసిందని ఆ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ ఈరోజు (మంగళవారం) వెల్లడించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్, ఎస్పీ నడుమ వాడివేడిగా చర్చలు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజీవ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. ‘సీట్ల పంపకంపై చర్చలు సాగుతున్నాయి. మేము కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు కేటాయించాం’ అని ఆయన వివరించారు. అయితే సీట్ల సర్దుబాటు ఇంకా ఓ కొలిక్కి రాలేదని సమాచారం.
నిన్న(సోమవారం) న్యూఢిల్లీలో జరిగిన మొదటి విడత చర్చల్లో రెండు పార్టీలూ ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో ఇవాళ రెండో విడత చర్చలు జరగనున్నాయి. కాగా మునుపు తమకు 181 సీట్లు కావాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్.. ఇప్పుడు కొంచెం వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. వంద నుంచి రెండొందల సీట్ల వరకూ ఇస్తే చాలని ఆ పార్టీ అంటోందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 26 సీట్లు ఇచ్చేందుకు ఎస్పీ సుముఖత వ్యక్తం చేస్తోందని రాజీవ్ రాయ్ తెలిపారు. రెండో విడత చర్చల అనంతరం సీట్ల కేటాయింపుపై స్పష్టత రానుంది.
లోక్సభ ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ స్థానాన్ని కారణంగా చూపుతూ కాంగ్రెస్ భారీ సంఖ్యలో సీట్లను ఆశిస్తోందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థులు బరిలోకి దిగాలనుకుంటున్న నియోజకవర్గాల జాబితాను ఆ పార్టీ రూపొందించింది. కాగా 2017- యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే ఘోర పరాజయం ఎదురైంది. ఆ ఎన్నికల్లో 107 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం ఏడు సీట్లే గెలుచుకుంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 47 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 2022లో విడిగా పోటీ చేసిన ఈ పార్టీలు.. 2027 ఎన్నికల కోసం మళ్లీ జతకట్టాయి. ఈసారి ఎలాగైనా నెగ్గి తీరాలని వ్యూహాలు రచిస్తున్నాయి.
ఈ వార్తలూ చదవండి
అమెరికాలో వలసదారులకు గ్రీన్ కార్డు అవకాశం?.. డెమోక్రాట్ల కొత్త బిల్లు..
హసీనా ప్రతిపాదనను తిరస్కరించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం