Share News

అమెరికాలో వలసదారులకు గ్రీన్ కార్డు అవకాశం?.. డెమోక్రాట్ల కొత్త బిల్లు..

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:59 PM

అమెరికాలో బహిష్కరణ ఆదేశాలు ఎదుర్కొంటున్న లక్షలాది మంది వలసదారులకు ఊరటనిచ్చేలా డెమోక్రటిక్ పార్టీ సిద్ధమైంది. దశాబ్దాలుగా ఉంటున్న వలసదారులకు శాశ్వత నివాస (గ్రీన్ కార్డు) అర్హత కల్పించే దిశగా డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యులు కీలక అడుగు వేశారు.

అమెరికాలో వలసదారులకు గ్రీన్ కార్డు అవకాశం?.. డెమోక్రాట్ల కొత్త బిల్లు..
US Green Card

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో బహిష్కరణ (డిపోర్టేషన్) ఆదేశాలు ఎదుర్కొంటున్న లక్షలాది మంది వలసదారులు ఊరటనిచ్చేలా డెమోక్రటిక్ పార్టీ సిద్ధమైంది. దశాబ్దాలుగా ఉంటున్న వలసదారులకు శాశ్వత నివాస (గ్రీన్ కార్డు) అర్హత కల్పించే దిశగా డెమోక్రటిక్ పార్టీ చట్టసభ సభ్యులు కీలక అడుగు వేశారు. కాలిఫోర్నియాకు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధులు లతీఫా సైమన్, జో లోఫ్‌గ్రెన్, జాన్ గరమెండి, జువాన్ వర్గాస్ కలిసి నవంబర్ 19న అమెరికా ప్రతినిధుల సభలో ‘ప్రొటెక్ట్ అవర్ నైబర్స్ యాక్ట్’ (Protect Our Neighbors Act - H.R. 11120) పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు.


బిల్లు నేపథ్యం:

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం వలసదారుల బహిష్కరణ చర్యలను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ బిల్లు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలిఫోర్నియాలో 30 ఏళ్లకు పైగా నివసించిన 73 ఏళ్ల భారతీయ మూలాలున్న వృద్ధురాలు హర్జిత్ కౌర్‌ను ఇటీవల ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను భారత్‌కు పంపించడం స్థానికంగా సంచలనం సృష్టించిది. హర్జిత్ కౌర్ ఘటన ఈ బిల్లు రూపకల్పనకు ప్రధాన ప్రేరణగా నిలిచింది. అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. బహిష్కరణ ఆదేశాలు ఉన్న సుమారు 11.9 లక్షల మంది ప్రస్తుతం అమెరికాలో కుటుంబాలతో కలిసి నివసిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా చట్టాల ప్రకారం ఒకసారి తుది బహిష్కరణ ఆదేశాలు జారీ అయితే వాటికి కాలపరిమితి ఉండదు. అయితే, ఈ కొత్త బిల్లు ప్రకారం అర్హులైన వలసదారుల విషయంలో ఆదేశాలు పదేళ్ల తర్వాత వాటంతటవే రద్దవుతాయి. ఆ తర్వాత వారు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


అర్హత నిబంధనలు:

  • ఈ ప్రయోజనం అందరికీ కాకుండా కఠిన నిబంధనలు పాటించిన వారికే వర్తిస్తుంది:

  • తుది బహిష్కరణ ఆదేశాలు జారీ అయిన తర్వాత కనీసం 10 ఏళ్ల పాటు అమెరికాలోనే నివసించి ఉండాలి.

  • ఇమ్మిగ్రేషన్ చట్టంలోని నిర్దిష్ట ఉల్లంఘనల కింద మాత్రమే బహిష్కరణ ఆదేశాలు పొంది ఉండాలి.

  • అధికారుల పర్యవేక్షణ లేదా షరతులతో కూడిన నిబంధనలను ఉల్లంఘించకుండా, తప్పించుకు తిరగకుండా ఉండాలి.

  • ఎలాంటి నేర చరిత్ర గానీ, దేశ భద్రతకు ముప్పు కలిగించే అంశాలు గానీ ఉండకూడదు.

  • దరఖాస్తుదారులు తమ తాజా ఫెడరల్ ఆదాయపు పన్ను రిటర్నుల (Income Tax Returns) ధృవీకరించిన ప్రతిని సమర్పించాలి.

ఎలాంటి నేర చరిత్ర లేకుండా పన్నులు చెల్లిస్తూ సమాజంలో భాగమైన వారిని కుటుంబాల నుంచి వేరు చేయడం సరికాదని డెమోక్రటిక్ సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు, చట్టాన్ని ఉల్లంఘించి దేశంలో ఉండిపోయిన వారికి ఇది బహుమతి ఇచ్చినట్లు అవుతుందని వలస వ్యతిరేక సంఘాలు ఈ బిల్లును విమర్శిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 03:19 PM