హిందూ-సిక్కుల ఐక్యతకు సంకేతం: అమిత్ షా
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:32 PM
ఆరేళ్ల తర్వాత ఎన్డీఏ గూటికి మళ్లీ శిరోమణి అకాలీదళ్ చేరడం.. హిందూ-సిక్కుల ఐక్యతకు ఈ పొత్తు ఓ సంకేతమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
ఢిల్లీ, నవంబర్ 24: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆరేళ్ల విరామం తర్వాత శిరోమణి అకాలీదళ్ (SAD) మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఇవాళ (మంగళవారం) ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఘనస్వాగతం పలికారు.
హిందూ-సిక్కుల ఐక్యతకు ప్రతీక
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేసి అకాలీదళ్‌ను ఎన్డీఏలోకి ఆహ్వానించారని అమిత్ షా వెల్లడించారు. గురునానక్ దేవ్ జయంతి పర్వదినం రోజున ఎన్డీఏను విస్తరించడం ఆనందంగా ఉందని, ఈ పొత్తు కేవలం రాజకీయ కలయిక మాత్రమే కాదని హిందూ, సిక్కుల ఐక్యతకు, సోదరభావానికి ఒక గొప్ప సంకేతమని ఆయన అభివర్ణించారు. ఇకపై శిరోమణి అకాలీదళ్ ఎన్డీఏలో అధికారిక భాగస్వామిగా ఉంటుందని, రాబోయే పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ-అకాలీదళ్ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.
డ్రగ్స్ రహిత పంజాబ్, అవినీతి నిర్మూలన
పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడం, అవినీతిని సమూలంగా నిర్మూలించడం, జాతీయవాద శక్తులను ఏకం చేయడమే తమ కూటమి ప్రధాన లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. పంజాబ్ రైతుల సమస్యలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర సమన్వయంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై నిప్పులు
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో పంజాబ్‌లో డ్రగ్స్ సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆప్ పూర్తిగా విఫలమైందన్నారు. పవిత్ర గురు గ్రంథ్ సాహిబ్‌ను అవమానపరిచిన ఆమ్ ఆద్మీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని, పంజాబ్ ప్రజలు బీజేపీ-అకాలీదళ్ కూటమిని ఆశీర్వదించి ఎన్డీఏ సర్కార్‌ను అధికారంలోకి తెస్తారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.(SAD Rejoins NDA)
'ఇది రాజకీయ పొత్తు కాదు, భావోద్వేగంతో కూడిన బంధం'.. బీజేపీతో కలయికపై సుఖ్బీర్ సింగ్ బాదల్
పంజాబ్ హితం కోసమే భారతీయ జనతా పార్టీ (BJP) తో మళ్లీ చేతులు కలిపామని శిరోమణి అకాలీదళ్ (SAD) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ స్పష్టం చేశారు. ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్లతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ-అకాలీదళ్ కలయిక కేవలం ఒక రాజకీయ పొత్తు మాత్రమే కాదని, ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన బంధమని సుఖ్బీర్ సింగ్ బాదల్ అన్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తమ తండ్రి ప్రకాష్ సింగ్ బాదల్ పోరాటం చేసి, బీజేపీతో చేతులు కలిపారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ప్రస్తుతం పంజాబ్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) పరిపాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లోని రైతులు, యువత, కార్మికులు తీవ్రమైన సమస్యల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని బాదల్ పేర్కొన్నారు. రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి రావాలంటే పంజాబ్‌లో ఎన్డీఏ (NDA) ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!