Share News

మహిళా కలెక్టర్‌ను మీ ఎమ్మెల్యే వేధిస్తుంటే ఏం చేస్తున్నారు?: విజయ్ ప్రభుత్వాన్ని నిలదీసిన మద్రాస్ హైకోర్టు

ABN , Publish Date - Nov 24 , 2026 | 01:00 PM

టీవీకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును న్యాయస్థానం తప్పుబట్టింది.

మహిళా కలెక్టర్‌ను మీ ఎమ్మెల్యే వేధిస్తుంటే ఏం చేస్తున్నారు?: విజయ్ ప్రభుత్వాన్ని నిలదీసిన మద్రాస్ హైకోర్టు

ఇంటర్నెట్ డెస్క్: టీవీకే ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌పై అధికార పార్టీ ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ వ్యవహారం గురించి జులై 31నే ప్రభుత్వానికి సమాచారం అందినా.. ఇంతకాలం ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ లక్ష్మీనారాయణన్.. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆయన ఆదేశించారు. ‘ఎవరినైనా కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు నాకు చిన్న అనుమానం వచ్చినా సహించేది లేదు’ అని జడ్జి హెచ్చరించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ స్పందనను నిశితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. జులై 31న ఫిర్యాదు అందినప్పుడే చర్యలు ఎందుకు తీసుకోలేదని జస్టిస్ లక్షీనారాయణన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్.జాన్ సత్యన్ కోర్టుకు లిఖితపూర్వక వివరణ సమర్పిస్తూ.. ఫిర్యాదుకు సంబంధించి మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. అయితే, హైకోర్టు ఆ వివరణతో ఏకీభవించలేదు.


హోదాతో సంబంధం లేదు

‘ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన మహిళా కలెక్టర్‌తో ప్రభుత్వం మాట్లాడిందా? ఆమె భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుందా?’ అని హైకోర్టు ప్రశ్నించింది. మహిళలపై లైంగిక వేధింపుల విషయంలో హోదా, స్థాయితో సంబంధం లేకుండా మహిళలందరికీ రక్షణ కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. 'ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా, పారిశుధ్య కార్మికురాలు అయినా లైంగిక వేధింపుల నుంచి రక్షించాలి’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, బాధితురాలి గుర్తింపును వెల్లడించకూడదని గతంలో ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆమె వ్యక్తిగత వివరాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతుండడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం తమ పరిధిలో లేదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే, ప్రభుత్వ సమాధానంతో న్యాయస్థానం సంతృప్తి చెందలేదు.


ఎస్పీ కన్నా పైస్థాయి అధికారితో విచారణ

కలెక్టర్ తన ఫిర్యాదులో జిల్లా ఎస్పీ పేరును కూడా ప్రస్తావించినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ స్థాయి కన్నా పైస్థాయి అధికారితో కేసు దర్యాప్తు చేయించాలని జస్టిస్ లక్షీనారాయణ ఆదేశించారు. కాగా.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ తనకు వాట్సాప్‌లో అసభ్యకరమైన, లైంగిక ఉద్దేశంతో కూడిన సందేశాలు పంపారని కళ్లకురిచ్చి జిల్లా కలెక్టర్ ఆరోపించారు. సుమారు మూడు నెలల క్రితం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే మద్యం మత్తులో కలెక్టర్ అధికారిక నివాసానికి వెళ్లి, ఆమెతో అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 01:17 PM