Share News

వచ్చే నెల 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న హసీనా

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:43 AM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనా వచ్చే నెల 16న తన సొంత దేశానికి తిరిగి వెళ్లనున్నారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన రోజున తన దేశానికి తిరిగి వెళ్లాలని హసీనా నిర్ణయించుకున్నారు.

వచ్చే నెల 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న హసీనా

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ పార్టీ చీఫ్ షేక్ హసీనా వచ్చే నెల 16న తన సొంత దేశానికి తిరిగి వెళ్లనున్నారు. 1971 డిసెంబర్ 16న పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పొందిన రోజున తన దేశానికి తిరిగి వెళ్లాలని హసీనా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ప్రతినిధి సయ్యద్ మొజమ్మిల్ అలీ.. మీడియాకు తెలిపారు. ‘2024లో బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత అదే ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ విమానంలో ఆమె భారత్ వచ్చారు. ఢిల్లీ నుంచి ఢాకాకు సజావుగా వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని ఆమె కోరారు’ అని సయ్యద్ తెలిపారు.


కాగా.. తాను త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని హసీనా గత కొద్ది నెలలుగా చెబుతూ వచ్చారు. మరోవైపు హసీనా పునరాగమనం నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ఈనెల ఆరంభంలో తనకు కొత్త పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లు జారీ చేయాలని ఆమె కోరారు. మరోవైపు హసీనా పునరాగమనాన్ని పురస్కరించుకొని ఈనెల 19న అవామీ లీగ్ మద్దతుదారులు ఆమెకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. దీంతో బంగ్లా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది.


అడుగు పెట్టగానే అరెస్టు?

భారత్ నుంచి బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టిన వెంటనే హసీనాను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించే అవకాశం ఉందని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి షామా ఒబేద్ ఇస్లాం.. మీడియాకు తెలిపారు. హసీనాను ఒక నేరస్తులిగా తమకు అప్పగించాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఆమె బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన వెంటనే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. కాగా.. 2024లో విద్యార్థుల ఆందోళనల సమయంలో తలెత్తిన హింస కారణంగా వందల మంది చనిపోయారని, ఆ హింసాత్మక ఘటనలకు బాధ్యత వహించాలని బంగ్లాదేశ్ యుద్ధ నేరాల కోర్టు నిరుడు నవంబరులో హసీనాకు మరణశిక్ష విధించింది.


ఇవి కూడా చదవండి..

దేశవ్యాప్తంగా త్వరలో అనర్హుల రేషన్ కార్డుల ఏరివేత.. కేంద్రం రంగం సిద్ధం

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట

Updated Date - Nov 24 , 2026 | 10:49 AM