Share News

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట..!

ABN , Publish Date - Nov 23 , 2026 | 07:16 PM

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులకు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడిగారంటూ ఓ వీడియో వైరల్ అయింది. అయితే, ఆ వీడియో ఫేక్ అంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్.. అమితాబ్ అసలు ఆ ప్రశ్నే అడగలేదట..!
Amitabh Bachchan

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లపై బాంబు దాడులకు సంబంధించిన ప్రశ్నను అమితాబ్ అడిగారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అమితాబ్, సోనీ టీవీకి న్యాయపరమైన నోటీసులూ వెళ్లాయి. అయితే, ఈ వీడియో అసలు కేబీసీ ఎపిసోడ్‌కు చెందినది కాదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అసలైన వీడియోలో అమితాబ్ అలాంటి ప్రశ్న ఏదీ అడగలేదని తెలుస్తోంది.


నకిలీ వీడియోలో రూ.12.5 లక్షల ప్రశ్నగా పంజాబ్ రాష్ట్రం గురించి అమితాబ్ అడిగినట్లు ఉంది. ‘ఏ రాష్ట్రంలో నేరస్థులు పోలీస్ స్టేషన్లలో బాంబు పేలుళ్లు జరపడానికి భయపడటం లేదు?’ అని ఆయన ప్రశ్న అడిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. నాలుగు రాష్ట్రాల పేర్లను ఆప్షన్లుగా చూపించగా.. పంజాబ్‌ను సరైన సమాధానంగా ప్రకటించినట్లు ఉంది. అయితే, ఈ దృశ్యాలు 2022లో ప్రసారమైన కేబీసీ సీజన్ 14లోని 58వ ఎపిసోడ్ నుంచి తీసుకున్నవని తెలుస్తోంది. ఆ ఎపిసోడ్‌లో రూ.12.5 లక్షలకు అడిగిన అసలు ప్రశ్న ప్రముఖ చిత్రకారిణి అమృతా షేర్‌గిల్ గురించి. బుడాపెస్ట్‌లో జన్మించిన ఆమె తల్లి హంగేరియన్ కాగా, తండ్రి భారతీయుడు. బాంబు దాడులకు సంబంధించిన ప్రశ్న అసలు ఎపిసోడ్‌లో లేదు. అమితాబ్ స్వరాన్ని కూడా ఏఐ సాయంతో రూపొందించినట్లు తెలుస్తోంది.


కాగా, ఈ వీడియో ఆధారంగా సంగ్రూర్‌కు చెందిన న్యాయవాది ఇంద్రజీత్ అరోరా పిటిషనర్ రంజిత్ సింగ్ తరఫున అమితాబ్, సోనీ టీవీకి నోటీసులు పంపారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని, వీడియోను తొలగించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆప్ నేత బల్తేజ్ సింగ్ పన్నూ ఈ వీడియో నకిలీదని ఆరోపించారు. శిరోమణి అకాలీదళ్ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిని రూపొందించిందని పేర్కొన్నారు. అయితే, ఆయనవి కేవలం ఆరోపణలుగానే ఉన్నాయి. వాటిని నిర్ధారించే ఎలాంటి ఆధారాలు లభించలేదు. కాగా, లీగల్ నోటీసులపై ఇప్పటివరకూ అమితాబ్, సోనీ టీవీ స్పందించలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

చట్టం తెలియకుండా బాహుబలిలా వ్యవహరించొద్దు.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

పశ్చిమ బెంగాల్ కేబినెట్ సంచలన నిర్ణయం.. రాష్ట్రం పేరు మార్పునకు తీర్మానం..

Updated Date - Nov 23 , 2026 | 07:21 PM