Share News

పశ్చిమ బెంగాల్ కేబినెట్ సంచలన నిర్ణయం.. రాష్ట్రం పేరు మార్పునకు తీర్మానం..

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:43 PM

పశ్చిమ బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రం పేరును ప్రస్తుతం ఉన్న 'పశ్చిమ బెంగాల్'కు బదులుగా 'పశ్చిమ్ బంగా'గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పశ్చిమ బెంగాల్ కేబినెట్ సంచలన నిర్ణయం.. రాష్ట్రం పేరు మార్పునకు తీర్మానం..
West Bengal CM Suvendu Adhikari

కోల్‌కతా, నవంబర్ 23: పశ్చిమ బెంగాల్ పేరు మార్పు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రం పేరును ప్రస్తుతం ఉన్న 'పశ్చిమ బెంగాల్' (West Bengal)కు బదులుగా 'పశ్చిమ్ బంగా' (Paschim Banga)గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంగ్లీషులోనూ 'West Bengal'కు బదులుగా 'Paschim Banga' అనే పేరునే ఉపయోగించాలని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సువేందు అధికారి సోమవారం వెల్లడించారు


కోల్‌కతాలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సువేందు అధికారి తెలిపారు. డిసెంబర్ 4 నుంచి 14 వరకు జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ ప్రతిపాదనను సభ ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ప్రకటించారు. 1947లో దేశ విభజన సందర్భంగా జరిగిన బెంగాల్ విభజన చారిత్రక పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బెంగాలీ భాషలో ఇప్పటికే ‘పశ్చిమ్ బంగా’ అనే పేరు వాడుకలో ఉందని, ఇకపై ఆంగ్లంలోనూ అదే పేరును ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సువేందు అధికారి వెల్లడించారు.


ఈ మేరకు డిసెంబర్ 9న అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన అనంతరం ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని వెల్లడించారు. అయితే, అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందినంత మాత్రాన రాష్ట్రం పేరు వెంటనే మారదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును అధికారికంగా మార్చాలంటే పార్లమెంట్‌లో చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేయాలి. రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని తీసుకున్న అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

జ్వాలా MK-1 కౌంటర్ డ్రోన్ మిసైల్ పరీక్ష విజయవంతం

చట్టం తెలియకుండా బాహుబలిలా వ్యవహరించొద్దు.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

Updated Date - Nov 23 , 2026 | 05:46 PM