Share News

చట్టం తెలియకుండా బాహుబలిలా వ్యవహరించొద్దు.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

ABN , Publish Date - Nov 23 , 2026 | 03:55 PM

న్యాయమూర్తులు తమ అధికార పరిధిని దాటి వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అధికారాన్ని దూకుడుగా వినియోగించవద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు బిహార్‌కు చెందిన ఓ సెషన్స్ కోర్టు న్యాయమూర్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

చట్టం తెలియకుండా బాహుబలిలా వ్యవహరించొద్దు.. న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
Supreme Court

న్యూఢిల్లీ, నవంబర్ 23: న్యాయమూర్తులు తమ అధికార పరిధిని దాటి వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అధికారాన్ని దూకుడుగా వినియోగించవద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు బిహార్‌కు చెందిన ఓ సెషన్స్ కోర్టు న్యాయమూర్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాన్ని పాటించలేదనే కారణంతో ఓ పోలీసు అధికారిని కోర్టు ధిక్కరణ దోషిగా నిర్ధారించి జరిమానా విధించడాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. బాహుబలి మాదిరిగా వ్యవహరించవద్దంటూ న్యాయమూర్తికి చురకలు అంటించింది.


బిహార్‌కు సంబంధించిన ఓ కేసుపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు (సోమవారం) విచారణ చేపట్టింది. పోలీసు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి కోర్టుకు పిలిపించి, అదే రోజు ఆయనను దోషిగా నిర్ధారించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది. ఈ వ్యవహారంలో జడ్జి తీరు దూకుడుగా ఉందని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ధర్మాసనంలోని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తికి చట్టంపై ఉన్న అవగాహన తీవ్ర నిరాశ కలిగిస్తోందని పేర్కొన్నారు. న్యాయం చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ, న్యాయ ప్రక్రియకు సంబంధించిన నిబంధనలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చట్టంలోని కీలక అంశాన్ని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి వివరించారు.


భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) సెక్షన్ 384, పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 345 పరిధిని న్యాయమూర్తి సరిగ్గా అర్థం చేసుకోవాలని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి సూచించారు. కోర్టులో విచారణ సమయంలో ఎవరినైనా కొట్టడం, న్యాయస్థానాన్ని దూషించడం లేదా కోర్టు ఆదేశించినప్పటికీ బయటకు వెళ్లడానికి నిరాకరించడం వంటి చర్యలను నేరాలుగా పరిగణించవచ్చని ధర్మాసనం వివరించింది. అయితే, కోర్టు ఆదేశించినప్పటికీ పోలీసు అధికారి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడాన్ని కోర్టు సమక్షంలో జరిగిన నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇలాంటి సందర్భాల్లో చట్టం నిర్దేశించిన ప్రత్యేక న్యాయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని పేర్కొంది.


విచారణ సందర్భంగా న్యాయమూర్తిని బాహుబలి మాదిరిగా వ్యవహరించవద్దని చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. న్యాయమూర్తులు తమ అధికార పరిధిని తెలుసుకుని వ్యవహరించాలని, న్యాయాధికారాలను ఇష్టానుసారంగా వినియోగించకూడదని ధర్మాసనం హెచ్చరించింది. అవసరమైతే న్యాయ అకాడమీలో మరింత శిక్షణ పొందాలనీ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

జ్వాలా MK-1 కౌంటర్ డ్రోన్ మిసైల్ పరీక్ష విజయవంతం

పెద్దలుగా సహచరుని కుమార్తె వివాహం జరిపిన సైనికుల

Updated Date - Nov 23 , 2026 | 04:05 PM