జ్వాలా MK-1 కౌంటర్ డ్రోన్ మిసైల్ పరీక్ష విజయవంతం
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:06 PM
రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి స్వయంప్రతిపత్తి కౌంటర్ డ్రోన్ మైక్రో మిసైల్ వ్యవస్థ 'జ్వాలా MK-1'ను రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించారు.
జైపూర్, నవంబర్ 23: రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి స్వయంప్రతిపత్తి కౌంటర్ డ్రోన్ మైక్రో మిసైల్ వ్యవస్థ 'జ్వాలా MK-1'ను రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ రంగ సంస్థ ఐజీ డిఫెన్స్ (IG Defence) ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల నుంచి ఎదురవుతున్న ముప్పును సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో జ్వాలా MK-1ను రూపొందించినట్లు ఐజీ డిఫెన్స్ వెల్లడించింది. నిఘా, గూఢచర్యం, దాడుల కోసం వినియోగించే శత్రు డ్రోన్లను గుర్తించి, వాటి స్వభావాన్ని విశ్లేషించి, వాటిని అడ్డుకునేలా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు తెలిపింది.
ఐజీ డిఫెన్స్ వివరాల ప్రకారం.. జ్వాలా MK-1 సుమారు 2 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని వైమానిక లక్ష్యాలను ఎదుర్కోగలదు. అలాగే 50 మీటర్ల నుంచి 5,000 మీటర్ల ఎత్తులో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం దీనికి ఉంది. ఈ వ్యవస్థలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం 'గ్రిడ్' (GRID) అనే కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం. ఇది వివిధ సెన్సార్ల నుంచి సమాచారాన్ని సేకరించి, గుర్తించిన లక్ష్యాలను విశ్లేషిస్తుంది. అనంతరం మిషన్ నిర్వహణ, నిర్ణయ ప్రక్రియ, లక్ష్యాన్ని ఎదుర్కొనే చర్యలను సమన్వయం చేస్తుంది.
జ్వాలా MK-1ను 4x4 వాహనంపై అమర్చిన బహుళ క్షిపణి ప్రయోగ వ్యవస్థ ద్వారా ప్రయోగించేలా రూపొందించారు. దీనివల్ల అవసరాన్ని బట్టి వివిధ ప్రాంతాలకు తరలించి మోహరించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల్లో డ్రోన్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో సైనిక స్థావరాలు, కీలక రక్షణ ప్రాంతాల భద్రతకు ఇలాంటి కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పేదరిక నిర్మూలనలో తదుపరి సవాలు అదే: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
గోద్రా రైలు దహనం కేసు.. 17 ఏళ్ల తర్వాత దోషికి బెయిల్..