Share News

పేదరిక నిర్మూలనలో తదుపరి సవాలు అదే: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

ABN , Publish Date - Nov 23 , 2026 | 02:10 PM

పేదరికం నుంచి బయటపడ్డ వారు మళ్లీ ఆ ఊబిలో కూరుకుపోకుండా చూడటమే ప్రభుత్వం ముందున్న తదుపరి సవాలని కేంద్రం మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా వ్యాఖ్యానించారు.

పేదరిక నిర్మూలనలో తదుపరి సవాలు అదే: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Minister Nirmala Sitharaman on Poverty Eradication

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో పేదరిక నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. పేదరికం నుంచి బయటపడ్డ వారు మళ్లీ ఆ ఊబిలో కూరుకుపోకుండా చూడటమే ప్రభుత్వం ముందున్న తదుపరి సవాలని వ్యాఖ్యానించారు. ఆర్థిక సాయం, స్టాక్ మార్కెట్లు, డిజిటల్ ఎకానమి ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయాల్సి ఉందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలకు తోడుగా ఆదాయ మార్గాలు, నూతన సంస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు మరిన్ని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. లింక్డ్‌‌ఇన్ వేదికగా ‘ది డెకేడ్ ఇండియా టర్న్‌డ్ ది టైడ్ ఆఫ్ పావర్టీ’ అనే వ్యాసంలో మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అభిప్రాయాలను పంచుకున్నారు.


భారత్‌లో పేదరిక నిర్మూలనపై వరల్డ్ బ్యాంక్ ప్రచురించిన నివేదికను మంత్రి తన వ్యాసంలో పేర్కొన్నారు. 2011-2023 మధ్యకాలంలో 50 కోట్ల మంది ప్రజలను భారత్ పేదరికం నుంచి బయటకు తీసుకురాగలిగిందని వరల్డ్ బ్యాంకు పేర్కొన్నట్టు మంత్రి తెలిపారు. కటిక పేదరికాన్ని కూడా భారత్ నిర్మూలించిందని చెప్పారు. ఈ పురోగతి ఇచ్చిన ఉత్సాహంతో సమాజంలో అట్టడుగున ఉన్న వారినీ పైకి తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పేదరికాన్ని జయించిన వారు మళ్లీ దిగజారిపోకుండా చూడాల్సి ఉందని అన్నారు.


పేదరికం అంటే కేవలం అల్పాదాయం మాత్రమే కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉండటానికి భద్రమైన ఇల్లు, రక్షిత తాగునీరు, పారిశుధ్య వ్యవస్థ, ఆరోగ్య సదుపాయాలు వంటివి లేకపోతే ఆదాయం పెరిగినా కుటుంబాలు బలహీనంగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానం అనుసరిస్తోందని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన పథకాలతో సాధించిన పురోగతిని గురించి వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల గురించి ప్రస్తావించారు.


ఈ పథకాల అమలుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మార్గనిర్దేశనం చేశారని ప్రశంసించారు. సమస్యలు పరిష్కారానికి అవసరమైన సందర్భాల్లో ఆయన చొరవ చూపారని చెప్పారు. లబ్ధిదారులకు పథకాలు చేరుతున్నాయో? లేదో? తెలుసుకునేందుకు టెక్నాలజీ వినియోగించాలని ప్రధాని సూచించారని తెలిపారు.

ఆర్థిక వ్యవస్థలు, సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తేవడం ద్వారా సంక్షేమ పథకాల అమలు మెరుగైందని మంత్రి అన్నారు. మరిన్ని ఆదాయ మార్గాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జన్‌ధన్ అకౌంట్లు విజయవంతమైన విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక అవకాశాలు మరింత విస్తృతం కావడంలో మహిళల స్వయం సహాయక బృందాల పాత్ర గురించి మంత్రి ప్రత్యేకంగా వివరించారు. ఈ బృందాల్లో ప్రస్తుతం 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. అవకాశాలు అనేవి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్

సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సమావేశం

Updated Date - Nov 23 , 2026 | 02:13 PM