‘ఆయనను హత్య చేయాలనే భద్రత తొలగించారు’.. సోనియా సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:04 PM
‘హత్య చేయాలనే ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ భద్రతను తొలగించారు’ అంటూ సోనియా గాంధీ సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీ, నవంబర్ 24: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యేలా చేయాలనే ఉద్దేశంతోనే అప్పట్లో ఆయన భద్రతను ఉద్దేశపూర్వకంగా తొలగించారని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తాను రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)పుస్తకం గురించి తన పిల్లలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో జరిపిన ప్రత్యేక సంభాషణలో ఆమె ఈ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 'ఎక్స్' (X) వేదికగా పంచుకున్నారు.
'నాన్న భద్రతను తొలగించడం ప్రమాదవశాత్తు జరిగింది కాదు'
రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పర్యటనలను సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఆయన ఓపెన్ జీపులో ప్రయాణిస్తున్నప్పుడు రాళ్ల దాడి, నిరసనలు ఎదురయ్యాయని, అది చాలా భయంకరమైన పర్యటన అని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు, సంబంధిత అధికారులు ఆయన భద్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. ముఖ్యంగా బీహార్ పర్యటన తన ఆందోళనను పతాక స్థాయికి చేర్చిందని చెప్పారు.
'నాన్న భద్రతను తొలగించారు, తద్వారా ఆయన హత్యకు గురయ్యారు. నాన్న భద్రతను తొలగించడం అనేది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన కాదు. ఆయనను చంపాలనే ఉద్దేశంతోనే కావాలని చేశారు' అని సోనియా గాంధీ సంచలన ఆరోపణ చేశారు.
రాహుల్ గాంధీ ముందే హెచ్చరించిన ఘటన
ఆ పర్యటనలో రాజీవ్ గాంధీ వెంట ఉన్న రాహుల్ గాంధీ, రాళ్ల దాడి, నిరసనలను ప్రత్యక్షంగా చూశారని సోనియా గాంధీ గుర్తుచేసుకున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాహుల్ తనతో మాట్లాడుతూ.. 'అమ్మా, నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, అతి త్వరలోనే నేను ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని నాకు తెలుసు' అని ఆవేదన వ్యక్తం చేశారని సోనియా తెలిపారు.
పుస్తకంలో రాయని విషయాలు.. రాహుల్ గాంధీ భావోద్వేగం
500 పేజీలకు పైగా ఉన్న ఈ పుస్తకంలో కూడా అమ్మ ఇంకా కొన్ని విషయాలను రాయకుండా వదిలేశారని రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పేర్కొన్నారు. 'నాన్న భద్రతను ఉపసంహరించుకోవడం వెనుక ఒక ఉద్దేశం ఉంది. 2004లో తీసుకున్న నిర్ణయం మాలో కొందరికి ఉపశమనాన్ని, మరికొందరికి ఆనందాన్ని ఇచ్చింది' అని రాహుల్ వ్యాఖ్యానించారు. అమ్మ జ్ఞాపకాల ప్రయాణంలో అపారమైన ప్రేమతో పాటు భయంకరమైన విషాదం కూడా ఉందని, వాటన్నింటినీ ఆమె ఎంతో హుందాగా, ధైర్యంతో ఎదుర్కొన్నారని రాహుల్ కొనియాడారు.
పుస్తకం నేపథ్యం.. భారత్‌లో తొలి రోజులు
తన జ్ఞాపకాల ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశానని, దీనికి రాహుల్, ప్రియాంక తమ జ్ఞాపకాలను కూడా జోడించడంతో కథలకు కొత్త ప్రాణం వచ్చిందని సోనియా గాంధీ పేర్కొన్నారు. తన పిల్లలే తనకు అతిపెద్ద ఆనందం, బలం అని చెబుతూనే.. తన సహనాన్ని అత్యధికంగా పరీక్షించేది కూడా వారేనని సరదాగా వ్యాఖ్యానించారు.
1968లో ఇటలీ నుంచి భారత్‌కు వచ్చిన తొలి రోజులను గుర్తుచేసుకుంటూ, అప్పట్లో తాను చూసిన పేదరికం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోనియా గాంధీ వెల్లడించారు. (Sonia on Rajiv Security)
ఈ వార్తలు కూడా చదవండి...
పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!