Share News

కార్తీక దీపం వివాదం.. మదురై జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 09:51 AM

తమిళనాడులోని మదురై జిల్లాలో కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అధికారులు జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించే అంశానికి సంబంధించి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కార్తీక దీపం వివాదం.. మదురై జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని మదురై జిల్లాలో కార్తీక దీపోత్సవం నేపథ్యంలో అధికారులు జిల్లావ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించే అంశంపై ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నిషాంత్ కృష్ణ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు ఈనెల 23 రాత్రి 9 గంటల నుంచి 25 ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయి. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిషేధాజ్ఞలు కొనసాగుతాయి. తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాలంటూ ఒక వర్గం, అందుకు వ్యతిరేకంగా మరో వర్గం జనసమీకరణకు ప్రయత్నిస్తున్నట్లు మదురై నగర పోలీసు కమిషనర్, జిల్లా ఎస్పీ, తిరుమంగళం రెవెన్యూ డివిజనల్ అధికారి నివేదికలు సమర్పించారు. ఇతర జిల్లాల నుంచి కూడా ఇరు వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా ముందుజాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు.


ఈ కార్యకలాపాలపై నిషేధం

నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో మదురై జిల్లావ్యాప్తంగా సభలు, ఆందోళనలు, నిరసనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదు. తిరుప్పరంకుండ్రం కొండపైకి ఎవరూ ఎక్కరాదు. అయితే, అధికారుల అనుమతితో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులకు మినహాయింపు ఇచ్చారు. వివాహాలు, అంత్యక్రియలు వంటి వాటికి అనుమతి ఇచ్చారు. అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయానికి చెందిన సిబ్బంది నిర్వహించే మతపరమైన కార్యక్రమాలు, సంప్రదాయ పండుగ ఆచారాలకూ మినహాయింపు కల్పించారు.


కాగా.. తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై కార్తీక దీపం వెలిగించేందుకు ఈనెల 20న సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్‌ ఇంకా విచారణకు రాలేదు. కార్తీక దీపోత్సవం మంగళవాం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక విచారణకు అత్యవసర అనుమతి పొందితే తప్ప ఆ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో తిరుప్పరంకుండ్రం కొండ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

Updated Date - Nov 24 , 2026 | 09:51 AM