మారిషస్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..
ABN , Publish Date - Nov 24 , 2026 | 07:18 PM
మారిషస్ సమీపంలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.
పోర్ట్ లూయిస్, నవంబర్ 24: మారిషస్ సమీపంలోని హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇవాళ (మంగళవారం) భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS) వివరాల ప్రకారం.. భూకంప కేంద్రం మారిషస్-రీయూనియన్ ప్రాంతంలోని సముద్ర గర్భంలో ఉంది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించింది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సుమారు 4:36 గంటలకు ఈ భూకంపం వచ్చింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ద్వీపం అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి స్పష్టంగా కంపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనంతరం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. మరోవైపు, సునామీకి సంబంధించి యూఎస్జీఎస్ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే, ఆ సంస్థ గ్రీన్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేసింది. భూకంప ప్రభావం, నష్టానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెలువడాల్సి ఉంది.
కాగా, ఇటీవల హిందూ మహాసముద్రంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తరచుగా ప్రకంపనలు వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీటిలో ఆగ్నేయ హిందూ మహాసముద్ర రిడ్జ్, రోడ్రిగ్స్ ట్రిపుల్ జంక్షన్ సమీపంలో సంభవించిన ప్రకంపనలూ ఉన్నాయి. సముద్ర గర్భంలో సంభవించే భూకంపాల వల్ల సునామీ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సునామీ హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి
భారత సైన్యం కీలక నిర్ణయం.. సైనికుల మొబైల్ ఫోన్లలో 87 యాప్‌ల నిషేధం
సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ