తెలంగాణ బిడ్డను.. నీళ్లలో అన్యాయం చేస్తానా?
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:29 AM
‘‘సిద్దిపేట గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి ఇస్తాం. కార్యకర్తలు, నాయకులు చర్చించి ఒకరి పేరు చెబితే వచ్చే ఎన్నికల్లో వారికే టికెట్ ఇస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఏనాడో తెంచుకున్నా..
సీమ లిఫ్టు కట్టుకొమ్మని కమీషన్లు పొందింది కేసీఆరే
జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిపించి ప్లానిచ్చింది ఆయనే
అల్లుడు దొంగ, మామ గజదొంగ, బామ్మర్ది గంజాబ్యాచ్
బీజేపీతో మంతనాల్లేవని హరీశ్ ఎల్లమ్మపై ఒట్టేస్తాడా?
రబ్బరు చెప్పుల హరీశ్ కుటుంబానికి వేల కోట్లెక్కడివి?
నారాయణ, చైతన్యలకు పాలు పోసే డెయిరీ తనదే
చెల్లెను గెంటేసిన కేటీఆర్.. ఆడబిడ్డలను ఉద్ధరిస్తాడా?
గడ్డం పెరగడానికి 50 ఏళ్లు.. బుద్ధికి ఇంకెన్నేళ్లో
సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేకు కీలక మంత్రి పదవి ఇస్తా
శంకరమ్మ సహా ఉద్యమకారులకు పదవులిచ్చింది మేమే
సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు
ఆయనకు వెన్నుపోటు పొడిచిన ఘనుడు కేసీఆర్
సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం
రూ.544కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
సంగారెడ్డి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘సిద్దిపేట గడ్డ ఇక కాంగ్రెస్ అడ్డా. ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి ఇస్తాం. కార్యకర్తలు, నాయకులు చర్చించి ఒకరి పేరు చెబితే వచ్చే ఎన్నికల్లో వారికే టికెట్ ఇస్తా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం సిద్దిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాష్ట్రవ్యాప్తంగా అమలుచేసే ‘‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’’ను ఆయన ప్రారంభించారు. రెండు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పాటు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు సంబంధించి రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా సభలో 70 నిమిషాల పాటు సాగిన ముఖ్యమంత్రి ప్రసంగంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లపై విరుచుకుపడ్డారు. ‘‘మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు హరీశ్‌రావు... రేపు కేసీఆర్ అన్నకొడుకు అడుగుపెట్టేందుకు ఫ్లెక్సీలు కడుతున్నారు. సిద్దిపేట ఏమైనా అనాథల రాజ్యమా? వాళ్లకు పదవులిస్తే వేలకోట్లు దోచుకున్నారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. కార్యకర్తలు, ప్రజలు అనుకుంటే మళ్లీ సాధ్యమే. సిద్దిపేటలోనే కాదు, 2029లో తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్సే. బీఆర్‌ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు’’ అని అన్నారు.
కృష్ణా జలాల విషయంలో తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ అన్నారు. ‘‘నేను తెలంగాణ బిడ్డను. ఈ గడ్డపై పుట్టినోడిని. చిన్న వయసులోనే పెద్ద బాధ్యత ఇచ్చారు. ఈ గడ్డకు నేనెందుకు అన్యాయం చేస్తా? చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని కూడా తెంచుకున్నా. తెలంగాణ ప్రజల కోసం 2017లోనే టీడీపీని వదిలా’’ అని ఉద్వేగంగా చెప్పారు. వైఎస్సార్ వేసిన మెతుకులకు ఆశపడి పోతిరెడ్డిపాడు విషయంలో హరీశ్‌రావు వంత పాడారని ఆరోపించారు. జగన్‌ను ప్రగతిభవన్‌కు పిలిపించి రాయలసీమ లిఫ్టుకు ప్లాన్ ఇచ్చి కమీషన్లు తీసుకున్న చరిత్ర కేసీఆర్‌దేనన్నారు. ‘‘రోజమ్మ వండిపెట్టిన రొయ్యల పులుసు తిన్నది నువ్వు కాదా కేసీఆర్?’’ అని ప్రశ్నించారు.
కేసీఆర్‌ది వెన్నుపోట్ల రాజకీయం
కేసీఆర్‌ను సింగిల్‌విండో డైరెక్టర్‌గా గెలిపించింది కాంగ్రెస్సేనని రేవంత్ గుర్తుచేశారు. యూత్ కాంగ్రె్‌సలో పదవి ఇచ్చి ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది అప్పటి సిద్దిపేట ఎమ్మెల్యే, మంత్రి అనంతుల మదన్‌మోహన్ అన్నారు. అలాంటి వ్యక్తిపైనే 1983లో కేసీఆర్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారని చెప్పారు. తనను ఎమ్మెల్యేను, మంత్రిని చేసిన చంద్రబాబుకూ కేసీఆర్ వెన్నుపోటు పొడిచారన్నారు. తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పి, కేంద్రమంత్రి పదవి తీసుకుని కాంగ్రెస్‌నూ మోసం చేశారని మండిపడ్డారు. ’కత్తిని నమ్ముకున్నవాడు కత్తికే బలవుతాడు’ అన్నట్లు కేసీఆర్ ఏదో ఒకరోజు అదే వెన్నుపోటుకు బలవుతారని ఎద్దేవా చేశారు.
సభలో కేసీఆర్‌పై ముఖ్యమంత్రి ఒక దెయ్యం కథ చెప్పి నవ్వులు పూయించారు. విముక్తి కోసం ఎవరికైనా సాయం చేయాలనుకున్న ఓ దెయ్యం ఎర్రవెల్లి పొలంలో లుంగీ కట్టుకుని బీడీ తాగుతున్న ఓ బక్కటాయనను కలిసింది. పంటను సగం సగం పంచుకుందామన్న ఆ మనిషి ప్రతిసారీ మోసం చేశాడు. పైపంట దెయ్యానికి అంటే పల్లీ, కిందిపంట దయ్యానిది అంటే వరి, పైన కింద రెండూ దయ్యం వాటా అంటే మక్కలు వేశాడు. ఇదీ ముఖ్యమంత్రి చెప్పిన కథ. ‘‘ఆ మనిషే కేసీఆర్. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేశాడు’’ అని కథ ముగించారు. ’నమ్మితిరా సిద్దా అంటే ముంచితిరా రంగా’ అన్నట్లు కేసీఆర్ తీరు ఉంటుందని, ఆయనకు కుటుంబం తప్ప ఎవరూ అక్కర్లేదని విమర్శించారు.
హరీశ్‌కు ఎల్లమ్మ సవాల్
కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవని హరీశ్‌రావుకు కాంగ్రెస్ దయతోనే వైఎస్సార్ మంత్రిగా అవకాశం ఇచ్చారని రేవంత్ అన్నారు. రబ్బరు చెప్పులతో రాజకీయాల్లోకి వచ్చిన హరీశ్‌కు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని నిలదీశారు. ఆయన తమ్ముడు, బావమరిది సుమన్‌రావు, సతీమణి, మామ పేర్లపై భూములు, ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ‘‘అల్లుడు దొంగ, మామ గజదొంగ, బావమరిది గంజాయి బ్యాచ్’’ అని వ్యాఖ్యానించారు. శ్రీచైతన్య, నారాయణ కాలేజీలు, కార్పొరేట్ ఆసుపత్రులకు పాలు సరఫరా చేసే కాంట్రాక్టు హరీశ్‌కు చెందిన ముకుంద డెయిరీదేనని ఆరోపించారు. హరీశ్ వచ్చే ఎన్నికల వరకు బీఆర్‌ఎస్‌లో ఉండరని, బీజేపీ నేతలతో మంతనాలు సాగిస్తున్నారని అన్నారు. ‘‘బీజేపీతో మంతనాలు చేయడం లేదని సిద్దిపేట ఎల్లమ్మపై ఒట్టేసి చెబుతావా?’’ అని సవాల్ విసిరారు. కాళేశ్వరంలో భారీ అవినీతి చేసినందుకే హరీశ్‌కు రెండోసారి నీటిపారుదల శాఖ ఇవ్వలేదన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకే చెందిన జగ్గారెడ్డి కేసీఆర్ కుటుంబంతోనే రాజకీయాలు ప్రారంభించారని, ఆయన అప్పుల్లో కూరుకుపోతే వీళ్ల కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆస్తుల పంపకాల్లో అడ్డుగా ఉందని సొంత చెల్లెను మెడపట్టి ఇంట్లోంచి గెంటేశారని కేటీఆర్‌పై సీఎం ఆరోపించారు. అలాంటి కేటీఆర్ రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను ఉద్ధరిస్తాడంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. ‘‘కేటీఆర్‌కు గడ్డం పెరగడానికి 50 ఏళ్లు పట్టింది. బుద్ధి పెరగడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో’’ అని ఎద్దేవా చేశారు. జన్వాడ ఫాంహౌస్‌లో గంజాయి బ్యాచ్‌లతో ఎంజాయ్ చేసే మనిషి అక్కాచెల్లెళ్లను ఆదరిస్తాడా అని ధ్వజమెత్తారు. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లకు కక్కుర్తి పడ్డారని ఆరోపించారు. ఇందిరమ్మ చీరలు మాత్రం ఆడబిడ్డలకు అందం తెచ్చాయని అన్నారు. ‘‘తూ.. మీ బతుకు చెడ’’ అంటూ శాపనార్థాలు పెట్టారు.
శంకరమ్మకు ఒక్క పదవీ లేదా?
ఉద్యమకారులను వాడుకుని ఆత్మ బలిదానాలకు ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వారికి పదవులు ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. ఇటీవల లక్ష్మణ్‌గౌడ్ అనే ఉద్యమకారుడు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం, సన్నిహితులు అందుకున్న పదవులను సీఎం ఏకరువు పెట్టారు. కేసీఆర్‌కు సీఎం పదవి, కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, బిడ్డకు ఎంపీ, ఓడిపోగానే ఎమ్మెల్సీ, బంధువు వినోద్‌కుమార్ ఎంపీగా ఓడగానే ప్లానింగ్ కమిషన్ పదవి, సంతోష్‌రావుకు రాజ్యసభ, ప్రతిమ శ్రీనివాస్‌కు వేలకోట్ల కాంట్రాక్టులు, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇచ్చుకున్నారని వివరించారు. ఇన్ని ఇచ్చుకున్నవాళ్లకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఇవ్వడానికి ఒక్క పదవి కూడా లేదా అని ప్రశ్నించారు. ఆ తల్లి గుండెకోతను అర్థం చేసుకోకుండా బీఆర్‌ఎస్ అవమానించిందన్నారు. తాము ఆమెకు పదవి ఇచ్చామని, భవిష్యత్తులోనూ తగిన గౌరవం ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎం మాట్లాడుతుండగా శంకరమ్మ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. .
మెడికల్ కాలేజీకి మదన్‌మోహన్ పేరు
సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దివంగత అనంతుల మదన్ మోహన్ పేరు పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. మదన్‌మోహన్ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే విడుదల చేయాలని వేదికపైనే ఉన్న వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ముఖ్యమంత్రి ఆదేశించారు. తొలితరం ఉద్యమకారుడైన మదన్‌మోహన్‌ను కేసీఆర్, హరీశ్‌రావు కనుమరుగు చేశారన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించి, రావాల్సిన పరిహారం మంజూరు చేయాలని మంత్రి వివేక్‌ను, అధికారులను ఆదేశించారు.
మా వాళ్లలో కొందరిని ఎర్రగడ్డకు పంపాలి
గత వారం రోజులుగా తనపై విమర్శలు చేస్తున్న సొంత పార్టీ నేతలపైనా సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మావాళ్లు కొందరు ఈ మధ్య ఎర్రికుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారు. ఎర్రిలేసినట్లుగా వాగుతున్నారు. చేసిన మంచిని మైకుల్లో చెప్పి, చెడును చెవిలో చెప్పాలి. వీళ్లేమో చెడును మైకుల్లో, మంచిని చెవిలో చెబుతున్నారు. ఇలాంటి వాళ్లను మా కార్యకర్తలు ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపాలి’’ అన్నారు.
నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం: దామోదర
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఇందిరాగాంధీ 1980లో మెదక్ ఎంపీగా విజయం సాధించారని, తెలంగాణ తొలి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మదన్‌మోహన్ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం సిద్దిపేట అని గుర్తుచేశారు. ఇక్కడి నుంచే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరో 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు: వివేక్
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, వచ్చే ఏడాదిలో మరో 2 లక్షల ఇళ్లను అందజేయనున్నామని తెలిపారు. 4 లక్షల చేయూత పెన్షన్లు ఇచ్చామని, సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకంతో 20 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోందని, రూ.13వేల కోట్లతో సన్నబియ్యం ఇస్తున్నామని, 16 లక్షల మందికి రేషన్ కార్డులు అందించామని చెప్పారు.
హుస్నాబాద్‌ను కరీంనగర్‌లో కలపాలి: పొన్నం
హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన సీఎం రేవంత్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గౌరవెల్లితోపాటు రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. జిల్లాల పునర్విభజన జరిగితే హుస్నాబాద్ ప్రాంతాన్ని తిరిగి కరీంనగర్ జిల్లాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.
అడుగడుగునా నీరాజనం
సీఎం సాయంత్రం 5.12 గంటలకు హెలికాప్టర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్నారు. 5.30కు ముస్తాబాద్ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యకర్త చేతిలోని కాంగ్రెస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. దారిపొడవునా అభివాదం చేస్తూ సుమారు 2 కిలోమీటర్లు పాదయాత్రగా సాగి 6.12కు సభాస్థలికి చేరుకున్నారు. జనం భారీగా తరలిరావడంతో రోప్ పార్టీ అదుపు తప్పి కొంతదూరం ఇబ్బంది ఏర్పడింది. తోపులాటలో మహిళా కార్యకర్తలతో పాటు మైనంపల్లి హనుమంతరావు సైతం కిందపడ్డారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws