‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
ABN , Publish Date - Nov 19 , 2026 | 12:48 PM
సొంత పార్టీపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. రాజ్ గోపాల్, అనిరుధ్ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 19: సొంత పార్టీపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈరోజు (గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. రాజ్ గోపాల్, అనిరుధ్ వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. దీనిపై హైకమాండ్ దృష్టి సారించినట్లు తెలిపారు. క్రమశిక్షణ ముందు అందరూ సమానమే అని స్పష్టం చేశారు. తమది ప్రజాస్వామిక పార్టీగా చెప్పుకొచ్చారు. దేనికైనా సమయం రావాలన్నారు. కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకునే ముందు చాలా అవకాశాలు ఇచ్చామని గుర్తుచేశారు. కొత్త ఇన్‌ఛార్జ్ రాగానే అన్ని అంశాలను పరిశీలిస్తారని టీపీసీసీ చీఫ్ తెలిపారు.
నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదు
నీటి విషయంలో తప్పిదాలను, ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని మహేశ్ మండిపడ్డారు. కేటీఆర్ కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని డ్రామాలు చేసినా ప్రయోజనం శూన్యమని.. నీటి విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ వాటా విషయంలో కాంప్రమైజ్ ఉండదని సీఎం రేవంత్ పలుమార్లు చెప్పారని గుర్తుచేశారు. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలివెళ్లకుండా అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్ మోసం..
డ్యామ్ మీద కేంద్ర బలగాలు, KRMB నియంత్రణ కేంద్రం చేతిలో ఉన్నాయని.. అయినా కేంద్రాన్ని ఒక్కమాట అనకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే బద్నాం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను పదేళ్లు పక్కన పెట్టారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డికి పదేళ్లలో జాతీయ హోదా తేలేకపోయారని.. పదేళ్లు కృష్ణా బేసిన్‌ను నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్యానించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.84 లక్షల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు. గత ప్రభుత్వం.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ఆధునీకరణ, డిండి వంటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చుంటే రాష్ట్రంలో సాగునీటి విస్తీర్ణం పెరిగేదని చెప్పుకొచ్చారు.
కృష్ణా జలాల విషయంలో గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మహేశ్ ఆరోపించారు. నాడు 36 శాతం చాలని కేసీఆర్ అంగీకరించారని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 70 శాతం వాటా కోసం పోరాడుతోందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఏపీ 4.464 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకుంటే, తెలంగాణకు దక్కింది కేవలం 1,993 టీఎంసీలే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా కట్టారని.. నేషనల్ డ్యామ్ అథారిటీ, జాతీయ స్థాయి నిపుణులు సర్టిఫై చేశారని తెలిపారు. నెహ్రూ హయంలో కట్టిన ప్రాజెక్టులు దేవాలయాలని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ చౌకబారు ప్రకటనల వల్ల ప్రయోజనం లేదని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి...
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
Read latest Telangana News And Telugu NEws