Share News

ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం

ABN , Publish Date - Nov 19 , 2026 | 09:53 AM

అక్వాన్ తుపాను ఉత్తరాంధ్ర తీరంవైపు దూసుకొస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు రానున్న 24 నుంచి 36 గంటలు అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్ర తీరంవైపు అక్వాన్ తుపాను.. 24 నుంచి 36 గంటలు అప్రమత్తం
Cyclone Aqwan

అమరావతి, నవంబర్ 19: ‘అక్వాన్’ తుపాను ఉత్తరాంధ్ర తీరంవైపు దూసుకొస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు రానున్న 24 నుంచి 36 గంటలు అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘అక్వాన్’ తుపాను ఉత్తరం దిశగా వేగంగా కదులుతోంది. ఈరోజు(గురువారం) ఉదయం 5.30 గంటల సమయానికి విశాఖపట్నానికి 460 కి.మీ., కాకినాడకు 490 కి.మీ. దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కి.మీ. వేగంతో ఉత్తరం దిశగా తుపాను పయనించింది. నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున శ్రీకాకుళానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉంది.


తీరం దాటే సమయానికి తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. తుపాను ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


రేపు ఉత్తరాంధ్రలో విస్తారంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం దాటిన అనంతరం వర్షాల తీవ్రత వేగంగా తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో ఈ తుపాను ప్రభావం గణనీయంగా ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మత్స్యకారులు తదుపరి అధికారిక ప్రకటన వచ్చే వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ చేసింది. తీరప్రాంత, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.


చెరువులు, జలాశయాలు, లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాలపై జిల్లా యంత్రాంగం నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాను పరిస్థితిని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని.. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సూచనలు పాటించాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్ అసంతృప్తి

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

Read latest AP News And Telugu NEws

Updated Date - Nov 19 , 2026 | 09:53 AM