మెదక్ జిల్లాలో అగ్ని ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు దగ్ధం
ABN , Publish Date - Apr 27 , 2026 | 08:02 AM
మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది.
మెదక్ జిల్లా, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలోని మాసాయిపేట వద్ద NH-44పై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిపేర్ ముగించుకుని వస్తుండగా..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో సాంకేతిక సమస్య తలెత్తడంతో, దానిని రిపేర్ చేయించడం కోసం హైదరాబాద్ నుంచి మెదక్ తీసుకువచ్చారు. రిపేర్ పనులు పూర్తయిన తర్వాత ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున డ్రైవర్, క్లీనర్ బస్సును తీసుకుని తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. మాసాయిపేట పరిసర ప్రాంతాల్లో NH-44పై ప్రయాణిస్తుండగా, బస్సు ఇంజిన్ భాగం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. మంటలు నిమిషాల వ్యవధిలోనే బస్సు మొత్తానికి వ్యాపించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో నుంచి కిందకు దూకేశారు. దీంతో వారు క్షేమంగా బయటపడ్డారు.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది..
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్‌తో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది.
పోలీసుల దర్యాప్తు..
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయా? లేదా రిపేర్ పనుల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజావాణి సేవల విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
నటి అషురెడ్డి కుటుంబంపై నాన్ బెయిలబుల్ కేసు
Read Latest Telangana News And AP News And International News And Telugu News