Share News

మెదక్‌‌లో దారుణం.. టెస్టుల పేరుతో శిశువును అమ్మేసిన నర్సులు..

ABN , Publish Date - May 06 , 2026 | 11:52 AM

మెదక్‌లో లైఫ్ కేర్ ఆస్పత్రిలో జరిగిన శిశు విక్రయం ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుట్టిన ఆడ శిశువును రూ.1.50 లక్షలకు విక్రయించి, తల్లిదండ్రులను మోసం చేసిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

మెదక్‌‌లో దారుణం.. టెస్టుల పేరుతో శిశువును అమ్మేసిన నర్సులు..
Baby Sale Case

మెదక్ జిల్లా, BO 6 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లాలో శిశువిక్రయం ఘటన తీవ్ర కలకలం రేపింది. మెదక్ పట్టణంలోని లైఫ్ కేర్ ఆస్పత్రిలో పుట్టిన ఆడ శిశువును తల్లిదండ్రులకు తెలియకుండా విక్రయించిన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు, వైద్యశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ కేసులో ఇద్దరు నర్సులతో పాటు శిశువును కొనుగోలు చేసిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు.


డెలివరీ తర్వాత శిశువును తీసుకెళ్లిన నర్సులు..

పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్‌లోని లైఫ్ కేర్ ఆస్పత్రిలో ఓ మహిళ ఆడ శిశువును జన్మించింది. అయితే డెలివరీ అనంతరం శిశువుకు టెస్టులు చేయాల్సి ఉందని చెప్పి ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సులు ఉన్నిసా, నిలోఫర్ తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత శిశువుకు తీవ్రంగా బ్లీడింగ్ జరిగిందని, ఆ కారణంగా బిడ్డ మృతి చెందిందని తల్లిదండ్రులను సిబ్బంది నమ్మించినట్లు సమాచారం.


రూ.1.50 లక్షలకు శిశు విక్రయం..

పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. పుట్టిన ఆడ శిశువును ఆస్పత్రి సిబ్బంది సిద్ధిపేటకు చెందిన మహ్మద్ ఇక్బాల్‌కు రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. శిశువును అక్రమంగా విక్రయించి, తల్లిదండ్రులకు మృతిచెందినట్లు చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో శిశువు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


రెండు రోజుల క్రితం ఘటన..

ఈ దారుణ ఘటన రెండు రోజుల క్రితం బయటపడింది. అనుమానం వచ్చిన శిశువు తల్లి ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో నర్సుల పాత్ర బయటపడటంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు.


నలుగురి అరెస్ట్..

ఈ కేసులో నర్సులు ఉన్నిసా, నిలోఫర్‌తో పాటు శిశువును కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ ఘటనపై పోలీసులు మరింత సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.


లైఫ్ కేర్ ఆస్పత్రి సీజ్..

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు లైఫ్ కేర్ ఆస్పత్రిని సీజ్ చేశారు. అలాగే ఆస్పత్రి అనుమతులు, వైద్య సిబ్బంది వివరాలు, రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆస్పత్రిలో గతంలో కూడా ఇలాంటి అక్రమాలు జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు పాత రికార్డులను పరిశీలిస్తూ మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన డెలివరీలు, శిశు మరణాల వివరాలు ఆస్పత్రి సిబ్బంది కార్యకలాపాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జూబ్లీహిల్స్ బాలికల ట్రాప్ కేసుపై సజ్జనార్ స్పెషల్ ఫోకస్

పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పదిమంది అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 06 , 2026 | 11:57 AM