కారులో.. హుషారు!
ABN , Publish Date - May 22 , 2026 | 01:30 PM
సంస్థాగత నియామకాలపై బీఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రకటించారు.
బీఆర్‌ఎస్‌లో సభ్యత్వాల నమోదుకు సన్నద్ధం
గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నూతన కమిటీలు
పార్టీ పదవులకు పోటీపడుతున్న ఆశావహులు
ఉమ్మడి జిల్లా, నియోజకవర్గాలకు ఇన్‌చార్జుల నియామకం
ప్రతీ మండలంలో ఐదుగురితో సమన్వయ కమిటీ
బూత్ నుంచి ఇద్దరికి డిజిటల్ సభ్యత్వాలపై శిక్షణ
హరీశ్‌రావు పర్యవేక్షణలో ‘గులాబీ’ సైన్యానికి కసరత్తు
సంస్థాగత నియామకాలపై బీఆర్‌ఎస్ పార్టీ దృష్టి సారించింది. పార్టీకి సంబంధించిన కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ఇటీవల ‘గులాబీ’ బాస్ కేసీఆర్ ప్రకటించారు. బూత్‌స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కమిటీల ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న కమిటీల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తున్నారు. ముందుగా సభ్యత్వాల స్వీకరణను ముగించి.. ఆ తర్వాత నూతన కమిటీలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లాకు, నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ పార్టీ తరపున ఇన్‌చార్జులుగా నియమించారు. గులాబీ సైన్యాన్ని తీర్చిదిద్దడానికి మాజీ మంత్రి, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పర్యవేక్షిస్తున్నారు.
- (సిద్దిపేట, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
అప్పటి టీఆర్‌ఎస్.. ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీకి పురిటిగడ్డగా ఉమ్మడి మెదక్ జిల్లాను భావిస్తారు. 2001లో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మెతుకుసీమ ఊపిరిలూదుతూనే ఉంది. తొలి ఉప ఎన్నిక మొదలు చివరి అసెంబ్లీ ఎన్నికల వరకు గులాబీ పార్టీకి ఈ ప్రాంతం వెన్నుదన్నుగా నిలిచింది. అయితే అపజయాలు, లోటుపాట్లు కూడా లేకపోలేదు. మెతుకుసీమను కంచుకోటగా చేసుకున్న బీఆర్ఎస్కు ధీటుగా నేడు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తయారయ్యాయి. అందుకే క్షేత్రస్థాయిలో గులాబీ సైన్యాన్ని మరింత బలోపేతం చేసేదిశగా పావులు కదుపుతున్నారు.
బూత్ నుంచి జిల్లా దాకా
పార్టీ సభ్యత్వాల నమోదు కోసం గ్రామాలు, పట్టణాల్లోని ప్రతీ పోలింగ్ బూత్ నుంచి ఇద్దరిని ఎంపిక చేస్తున్నారు. ఈ ఇద్దరికీ డిజిటల్ సభ్యత్వాలపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. పార్టీలో సభ్యులుగా చేరిన వారి వివరాలను వీరు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేస్తారు. బూత్ వారీగా సభ్యత్వాలను పరిశీలించడానికి మండల స్థాయిలో ఐదుగురితో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. వీరికి అప్పగించిన బూత్‌లను నిత్యం పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ మండల సమన్వయ కమిటీ తమ నివేదికను నియోజకవర్గ ఇన్‌చార్జులకు నియోజకవర్గ ఇన్‌చార్జులు ఉమ్మడి జిల్లా సమన్వయకర్తగా ఉన్న గ్యాదరి బాలమల్లుకు వివరాలు సమర్పించాలి. సాధ్యమైనంత ఎక్కువ సభ్యత్వాలు చేయాలని పార్టీ దిశానిర్ధేశం చేసింది.
పార్టీ పదవులపై గురి
కొత్తగా ఏర్పాటవుతున్న పార్టీ కమిటీలపై ఆశావహులు దృష్టిసారించారు. ఏళ్ల తరబడిగా గ్రామ, మండల, జిల్లాలకు పాత కమిటీలనే కొనసాగించారనే అభిప్రాయాలున్నాయి. అధ్యక్షులు మినహా కమిటీలోని ఇతర పదవులను భర్తీ చేయకపోవడంపైనా ఇప్పటి వరకు అసంతృప్తి వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే పాత కమిటీలను రద్దుచేసి కొత్త కమిటీలకు కసరత్తు ప్రారంభించిన క్రమంలో ఆశావహులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవే కమిటీలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగించనున్న తరుణంలో తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ప్రధానంగా గ్రామ, మండలాల కమిటీ అధ్యక్ష, ఇతర పదవుల కోసం ఇప్పటి నుండే ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలించని వారు, టికెట్లు దక్కనివారు కనీసం పార్టీ పదవుల్లోనైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
వారికే ‘జిల్లా’ బాధ్యతలు..
పార్టీని ముందుకు నడిపించే జిల్లా అధ్యక్షులపైనే అందరి దృష్టి నెలకొన్నది. నిన్నటిదాకా సిద్దిపేటకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మెదక్‌కు మాజీ ఎమ్మెల్యే పద్మ బాధ్యతలు నిర్వర్తించారు. వీరంతా అనుభవజ్ఞులే కావడంతో క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకున్నారు. ప్రస్తుతం కమిటీలు రద్దు కావడంతో కొత్త రథసారథుల ఎంపిక అనివార్యమైంది. సభ్యత్వాల నమోదు పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిని ముందుగా ఎన్నుకుంటారా.. లేదంటే గ్రామ, మండల కమిటీలను ఎన్నుకున్నాకే నిర్ణయం తీసుకుంటారా అనే విషయంపై స్పష్టత లేదు.
పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఇక్కడి బాధ్యతలన్నీ హరీశ్‌రావుకే అప్పగిస్తుంటారు. తాజా పరిణామాల్లోనూ హరీశ్‌రావు కీలకంగా వ్యవహరిస్తూ సభ్యత్వాలు, ఇన్‌చార్జిల నియామకమాలపై పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా స్థాయిలో పార్టీని ముందుకు తీసుకెళ్లే వారికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని యోచిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలు, కేసీఆర్ సూచనలతోపాటు అనుభవం ఉన్న నేతలకే ప్రాధాన్యత దక్కనున్నట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ మూడు జిల్లాల్లోనూ కీలక నేతలంతా అధ్యక్ష పదవి కోసం రేసులో ఉన్నారు.
సభ్యత్వ నమోదు కోసం నియమితులైన ఇన్‌చార్జులు
నియోజకవర్గం - ఇన్‌చార్జి పేరు
పటాన్‌చెరు - ఎర్రోళ్ల శ్రీనివాస్
సంగారెడ్డి - చంద్రాగౌడ్
జహీరాబాద్ - దేవి ప్రసాద్
నారాయణఖేడ్- జైపాల్‌రెడ్డి
అందోల్ - పట్నం మాణిక్యం
సిద్దిపేట - వంటేరు యాదవరెడ్డి
దుబ్బాక - కాసాల బుచ్చిరెడ్డి
గజ్వేల్ - రాధాక్రిష్ణశర్మ
నర్సాపూర్ - నరహరిరెడ్డి
మెదక్ - ఫారూక్ హుస్సేన్
హుస్నాబాద్ - జి.వి రామక్రిష్ణారావు
ఈ వార్తలు కూడా చదవండి:
కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
Read Latest AP News And Telangana News And International News And Telugu News