Share News

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్

ABN , Publish Date - May 22 , 2026 | 12:41 PM

గతేడాది బ్రిటన్ వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్‌లో నిలిచారు. గతేడాది యూకేలోకి నికర వలసలు దాదాపు సగం మేర తగ్గినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు టాప్
Indians Leaving UK

ఇంటర్నెట్ డెస్క్: గతేడాది యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయులు సంఖ్యాపరంగా టాప్‌లో నిలిచారు. బ్రిటన్ ప్రభుత్వ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఎన్ఎస్ఓ) డేటా ప్రకారం, గతేడాది బ్రిటన్‌లో నికర వలసలు దాదాపు సగానికి పైగా తగ్గి 1,71,000కు పడిపోయాయి. ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో దాదాపు 51 వేల మంది గతేడాది స్వదేశానికి తిరిగొచ్చారు. ఉద్యోగం కోసం వెళ్లిన వారిలో 21 వేల మంది వెనక్కు వచ్చేశారు. మరో 3 వేల మంది ఇతర కారణాలతో తిరుగుప్రయాణమయ్యారు. యూకేను వీడిన విదేశీయుల్లో భారతీయుల తరువాతి స్థానంలో చైనీయులు నిలిచారు. గతేడాది మొత్తం 46 వేల మంది చైనీయులు యూకేను వీడారు.


కన్జర్వేటివ్‌ల పాలనలో బ్రిటన్‌లో 9,44,000గా ఉన్న నికర వలసలు ప్రస్తుతం 1,71,000కు దిగొచ్చాయని యూకే హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ చెప్పారు. అయితే, బ్రిటన్‌ అభివృద్ధికి పాటుపడే వారికి మాత్రం తాము ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతామని అన్నారు. దేశ సరిహద్దుల వద్ద పరిస్థితిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు. తక్కువ జీతాలకు వచ్చే విదేశీ వర్కర్లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాను ఒక కొత్త వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నట్టు కూడా చెప్పారు.

యూకే నుంచి తిరిగొచ్చే భారతీయుల సంఖ్య పెరిగినప్పటికీ అక్కడ వివిధ కేటగిరీల వీసాలు పొందుతున్న వారిలో భారతీయులే టాప్‌లో ఉన్నారు. 2026 మార్చితో ముగిసిన ఏడాదిలో జారీ అయిన హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాలను అత్యధికంగా 1,07,306 మంది భారతీయులు పొందారు. స్కిల్డ్ వర్కర్ వీసాలు పొందిన విదేశీయుల్లో కూడా భారతీయులే టాప్‌లోఉన్నారు. గతేడాది 89,851 మంది భారతీయుల దరఖాస్తులకు ఆమోదం లభించింది.


ఆ తరువాత స్థానంలో ఉన్న పాకిస్థానీలకు 16,607 వర్కర్ వీసాలు, నైజీరియన్లకు 13,409 వర్కర్ వీసాలు వచ్చాయి. ఇక స్టూడెంట్ వీసాల కేటగిరీలో భారతీయులకు 70,371 గ్రాడ్యూయేట్ రూట్ వీసా పొడిగింపులు లభించాయి. స్పాన్సర్డ్ స్టడీ వీసా కేటగిరీలో కూడా 90,425 దరఖాస్తుల అప్రూవల్స్‌తో భారతీయులే టాప్‌లో నిలిచారు. బ్రిటన్‌కు ఐరోపాయేతర దేశాల నుంచి వలసలు గతేడాది 47 శాతం మేర తగ్గాయని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వలసలు 2021 నాటి స్థాయికి పడిపోతున్నాయని ఎన్ఎస్ఓ డిప్యూటీ డైరెక్టర్ శారా క్రాఫ్ట్స్ తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

అట్లాంటాలో తానా వాలీబాల్ టోర్నమెంట్

ఖతర్‌లో మహానాడుకు మంత్రి ప్రార్థసారథి

Updated Date - May 22 , 2026 | 01:46 PM