బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే..
ABN , Publish Date - May 06 , 2026 | 12:38 PM
బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు.
దేశంలో కుటుంబపాలనకు కాలం చెల్లింది
తమిళనాడు ఎన్నికలు దేశ రాజకీయాలకు కనువిప్పు
రెండేళ్లకే రేవంత్‌రెడ్డిపై వ్యతిరేకత
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్
గజ్వేల్(సిద్దిపేట): బెంగాల్‌లో బీజేపీ విజయం సాధించిందని... నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ అన్నారు. ఈ నెల 10న ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీలో బుధవారం నిర్వహించిన గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. దేశంలో నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికలతో కుటుంబ పాలనకు కాలం చెల్లిందని నిరూపించాయని, బెంగాల్, తమిళనాడులలో కుటుంబ పార్టీలను ప్రజలు ఇంటికి పంపించారన్నారు.
చరిత్ర నిర్మాతలు ప్రజలేనని, ప్రజలు అనుకుంటే ప్రళయాన్ని సృష్టించగలరని, ముఖ్యమంత్రులను, మంత్రులను ఓడించి, ఆటోడ్రైవర్‌ను గెలిపించారంటే ప్రజలను తక్కువగా అంచనా వేయవద్దన్నారు. తమిళనాడు ఎన్నికలతో డబ్బులతో ఏదైనా సాధించగలమని భావించే కుటుంబ పార్టీలు బుద్ధి తెచ్చుకోవాలని, అధికారం, అహంకారం, దౌర్జన్యం, బెదిరింపులు, గుండాయిజం, రౌడీయిజం ఎప్పుడూ పనిచేయవని, కేసీఆర్‌ను, మమతా బెనర్జీని అందుకే ప్రజలు ఓడించారని అన్నారు. బెంగాల్‌లో 293 సీట్లలో 206 సీట్లను బీజేపీకి ఇచ్చి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, 15ఏళ్లు సీఎంగా పనిచేసిన మమత ఓడిపోవడం, పార్టీ నిర్మాణం లేకుండా, సంస్థాగత నాయకులు, డబ్బులు, పరపతి లేకుండా పోటీచేసిన విజయ్ గెలుపొందడంతోనైనా నాయకులు అర్థం చేసుకోవాలన్నారు.
నాడు ఎన్టీఆర్, నేడు విజయ్ ప్రభంజనం సృష్టించారని, సామాన్యులను సైతం గెలిపించి ప్రజలు తమ సత్తాచాటారని కొనియాడారు. తెలంగాణలో రెండేళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని, రిటైర్మెంట్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. రేవంత్ ప్రభుత్వం నిష్ర్కియా పర్వతంగా ఉందని, కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహాత్యలు చేసుకుంటున్నారన్నారు. 50ఏళ్లుగా తెలంగాణ బీజేపీ నాయకులు సంబరాల కోసం ఎదురు చూస్తున్నారని,
సంబరాలు చేసుకునే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. మోదీ సభకు సిద్దిపేట జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని, ఏడు వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు అంకితం చేయనున్నారని, రూ.35వేల కోట్లతో వేయనున్న రీజనల్ రింగ్‌రోడ్డుకు ఆమోదం తెలిపారని చెప్పారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు భైరి శంకర్, నాయకులు కప్పర ప్రసాద్, గాడిపల్లి భాస్కర్, సింగం సత్తయ్య, రాంరెడ్డి, జశ్వంత్‌రెడ్డి, పేర్ల శ్రీనివాస్, నందన్‌గౌడ్, మల్లేశ్, అశోక్‌గౌడ్, మనోహార్‌యాదవ్, అశోక్‌యాదవ్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష
అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్
Read Latest Telangana News and National News