శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
ABN , Publish Date - May 06 , 2026 | 11:55 AM
క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీలో నుంచి సరఫరా చేయబోతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. శ్రీసిటీలో 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలు ఉన్నారని.. శ్రీశక్తికి ఇది నిదర్శనమన్నారు.
తిరుపతి, మే 6: శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్యారియర్ ఏసీ తయారీ కేంద్రం భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం శ్రీసిటీలో నుంచి సరఫరా చేయబోతోందని తెలిపారు. కుటుంబంలో తల్లి ప్రేమ ముందు.. ఓ తండ్రి చేసే త్యాగాలు పిల్లల కంటికి తెలియదన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి చేసిన కృషిని కొందరు సరిగ్గా అర్థం చేసుకోరని.. అయినా కూడా ఆయన అనుకున్నది సాధిస్తారని చెప్పుకొచ్చారు.
పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన సేవలైనా ఒక్క వాట్సాప్ మేసేజ్‌తో చేయటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. శ్రీసిటీలో 70 వేల మంది ఉద్యోగుల్లో 35 వేల మంది మహిళలు ఉన్నారని.. శ్రీశక్తికి ఇది నిదర్శనమన్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ఈ నెలాఖరులోపు ఏఐ ద్వారా నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టబోతున్నామని లోకేశ్ వెల్లడించారు.
శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభించనుంది. శ్రీసిటీ పరిధిలోని ఆరూరు వద్ద ఈ పరిశ్రమకు 40 ఎకరాల స్థలం కేటాయించారు. ఒకటి, రెండు టన్నుల సామర్థ్యం కలిగిన ఏసీలే కాకుండా భారీ పారిశ్రామిక సముదాయాలకు వినియోగించే 1000 టన్నుల నుంచి 5000 టన్నుల సామర్థ్యం కలిగిన కూలింగ్ సిస్టమ్స్‌ను క్యారియర్ సంస్థ తయారుచేయనుంది.
ఈరోజు ఉదయం సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పారిశ్రామికవాడకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రతిఒక్కరినీ మంత్రి ఆత్మీయంగా పలకరించి ఫొటోలు దిగారు. శ్రీసిటీలో శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ తిరిగి ఉండవల్లికి వెళ్లనున్నారు.
ఇవి కూడా చదవండి...
మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్
ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు
Read Latest AP News And Telugu News