మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని ఒకరి మృతి..
ABN , Publish Date - May 28 , 2026 | 07:23 AM
మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది.
మహబూబ్‌నగర్ జిల్లా, మే 28 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై నిన్న(బుధవారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును.. బెంగళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని తిరుపతి రిటైర్డ్ డీఎస్పీ సాంబశివారెడ్డి కుమారుడు అశోక్ రెడ్డిగా గుర్తించారు. అశోక్‌రెడ్డి మృతి వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా, పోలీసులు వాహనాలను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇటీవల జాతీయ రహదారులపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో డ్రైవర్లు అలసట, అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రయాణ భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక సూచనలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News