Share News

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ

ABN , Publish Date - Apr 11 , 2026 | 01:18 PM

పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.

నారీ శక్తి వందనం బిల్లుతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు: డీకే అరుణ
DK Aruna

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ బిల్లు అమలైతే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ దక్కుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంట్‌‌లో ప్రత్యేక సమావేశాలు పెట్టారని.. ఈనెల 16, 17, 18 తేదీల్లో సెషన్ జరగనుందని వెల్లడించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో సహా అనేక పార్టీలు మహిళా బిల్లును వ్యతిరేకించాయని తెలిపారు. గతంలో చాలామంది ఈ బిల్లు తేవాలని చూశారు.. తప్ప ఎవరి వల్ల అది సాధ్యమవ్వలేదని.. కానీ మోదీ ఈ బిల్లును సుసాధ్యం చేయనున్నారని అన్నారు. చట్టం చేయడమే కాదని.. అమలు చేయడంపైనా కసరత్తు జరుగుతోందని చెప్పారు. పార్టీకలతీతంగా ఈ బిల్లుకు మద్దతు పలకాలని సూచించారు.


మహిళ బిల్లు కొత్త శకానికి నాంది పలకనుంది..

2029 ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని ఎంపీ డీకే అరుణ కోరారు. ఇది ఒక చట్టం కాదని.. కోట్లాది మంది మహిళల ఆశ, ఆశయమని ఉద్ఘాటించారు. చట్టానికి ఆమోదం తెలిపితే కొత్త శకానికి నాంది పలకనుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ నుంచి పార్లమెంట్‌లో ప్రస్తుతం ఇద్దరు మహిళలమే ప్రాతినిధ్యం వహిస్తున్నామని వివరించారు. ఈ బిల్లు అమలైతే స్థానాలు పెరుగుతాయని చెప్పుకొచ్చారు. డీ లిమిటేషన్ కూడా పూర్తయితే తెలంగాణ నుంచి 9 మంది మహిళలు పార్లమెంట్‌లో అడుగు పెడతారని తెలిపారు. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 180 వరకు పెరుగుతాయని.. అంటే 60 మంది మహిళలు అసెంబ్లీలో ఉంటారని ప్రస్తావించారు.ఎస్సీ, ఎస్టీలకు కూడా మంచి అవకాశాలు రానున్నాయని వివరించారు. ఇది తాత్కాలికం కాదని.. మూడు టర్మ్‌ల వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు.


మహిళలు రాజకీయాల్లోకి రావాలి..

మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ ఆకాంక్షించారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ.. ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తోందని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలు ఉంటే ఆయా ప్రాంతాలు, రాష్ట్రాల్లో వారికి ఇచ్చిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. ఆర్థిక, విద్య, ఉపాధి వంటి అన్ని రంగాల్లో తమ మార్క్ చూపిస్తారని వివరించారు. భారత ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారన్నారు. ఈ బిల్లును అడ్డుకోవాలనే ఆలోచనను మార్చుకోవాలని చెప్పారు. మహిళలకు గౌరవాన్ని పెంచాలని సూచించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఎంతో సమయం లేదని.. కానీ మహిళా శక్తికి రాజకీయ శక్తి తోడైతే వికసిత్ భారత్ లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చని వివరించారు. ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే క్రెడిట్ బీజేపీకి ఎక్కడ పోతుందోనని ఆలోచించకుండా పార్టీలకతీతంగా మద్దతు తెలపాలని అన్నారు. మహిళలను తక్కువ అంచనా వేస్తున్నారనే అపవాదును దేశానికి తీసుకురావద్దని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు

సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ

హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Apr 11 , 2026 | 01:23 PM