పూల పండుగకు వేళాయే!
ABN , Publish Date - Oct 07 , 2026 | 11:44 AM
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగకు కూకట్‌పల్లి సిద్ధమైంది.
రేపటి నుంచే వేడుకలు..
కూకట్‌పల్లిలో ప్రతియేటా రెండు రోజుల ముందే ఆరంభం
ఎత్తయిన బతుకమ్మలు.. ఐడీఎల్ చెరువులో నిమజ్జనాలు
సద్దుల బతుకమ్మకు లక్ష మందికిపైగా వచ్చే అవకాశం
ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్‌పల్లి(హైదరాబాద్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగకు కూకట్‌పల్లి సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానుండగా.. కూకట్‌పల్లి మాత్రం రెండు రోజుల ముందుగానే అనగా ఈనెల 8 నుంచే వేడుకలు ప్రారంభం కానున్నాయి. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయానికి అనుగుణంగా మహిళలు తీరొక్క పూలతో భారీ, ఎత్తయిన బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేయనున్నారు. బతుకమ్మలను ఆడిన అనంతరం ఐడీఎల్ చెరువులో నిమజ్జనం చేయడం ఇక్కడి ప్రత్యేకత. సద్దుల బతుకమ్మ రోజున భారీగా ప్రజలు తరలిరానుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
ముందస్తు సందడి..
బతుకమ్మ.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ పండగ. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే పూలను సేకరించి వాటిని అందంగా పేర్చి గౌరమ్మగా కొలుస్తూ మహిళలు నిర్వహించే ఈ వేడుకకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. పూలను దేవతగా భావించి పూజించే ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. ఉయ్యాల పాటలు, గాజుల చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మ ఆటలతో తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాలు సందడిగా మారనున్నాయి. కూకట్‌పల్లిలో మాత్రం ఈ సంబురాలకు మరింత ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బతుకమ్మ వేడుకలను రెండు రోజుల ముందుగానే ప్రారంభించడం ఇక్కడ ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.
ఈనెల 8 నుంచే కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబురాలు మొదలుకానున్నాయి. మహిళలు పెద్దఎత్తున పాల్గొని తీరొక్క పూలతో భారీ బతుకమ్మలను పేర్చనున్నారు. కూకట్‌పల్లిలో ఎత్తయిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గునుగు, తంగేడు, చామంతి, జాజి, గుమ్మడి, మందారం తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి మహిళలు ఆటపాటలతో సందడి చేస్తారు. ‘బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ మహిళలు ఆలపించే పాటలతో ఈ ప్రాంతం మారుమోగనుంది. చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొననున్నారు.
ఐడీఎల్ చెరువులో నిమజ్జనం..
కూకట్‌పల్లి గ్రామంలో బతుకమ్మ ఆడిన మహిళలు ఏళ్లుగా ఐడీఎల్ చెరువుకు వెళ్లి బతుకమ్మలను నిమజ్జనం చేస్తున్నారు. ఈ సంప్రదాయం ఈ ఏడాది కూడా కొనసాగనుంది. సద్దుల బతుకమ్మ రోజున భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో నిమజ్జన ప్రాంతంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిది రోజులు నైవేద్యాలు
1. ఎంగిలిపూల బతుకమ్మ - నువ్వులు, బియ్యంపిండి
2. అటుకుల బతుకమ్మ - అటుకులు, పప్పు, బెల్లం,
3. ముద్దపప్పు బతుకమ్మ - బెల్లం, ముద్దపప్పు, పాలు
4. నానబియ్యం బతుకమ్మ - నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం
5. అట్ల బతుకమ్మ - అట్లు లేదా దోశలు
6. అలిగిన బతుకమ్మ - ఈరోజు బతుకమ్మను పేర్చారు.
7. వేపకాయల బతుకమ్మ - బియ్యం పిండిని వేపకాయలుగా చేయడం
8. వెన్నముద్దల బతుకమ్మ - నువ్వులు, వెన్న, బెల్లంతో కలిపి నైవేద్యం
9. సద్దుల బతుకమ్మ - పెరుగన్నం, పులిహోరా, ఐదు రకాల పిండి వంటలు
సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు
కూకట్‌పల్లిలో బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెండు రోజుల ముందుగానే సంబరాలు ప్రారంభిస్తాం. ఈసారి లక్ష మందికిపైగా ప్రజలు వేడుకలను వీక్షించే అవకాశం ఉంది. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం.
మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే, కూకట్‌పల్లి
ఈ వార్తలు కూడా చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పెరిగాయిగా.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
నిమ్స్‌లో 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News