రష్యాలో ప్లేగు వ్యాధి భయాలు.. స్పందించిన ట్రంప్
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:05 AM
రష్యాలో ప్లేగు వ్యాధి వ్యాప్తి భయాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ వ్యాధి నియంత్రణ కష్టంగా మారిందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: సైబీరియా (రష్యా) ల్యాబ్ నుంచి ప్లేగు వ్యాధి సూక్ష్మక్రిమి బయటపడిందన్న భయాలు ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. నిమోనియా లక్షణాలు ఉన్న వారితో పాటు ల్యాబ్ పరిసర ప్రాంతాల్లోని వారిని రష్యా అధికారులు ఇప్పటికే క్వారంటైన్ చేశారు. ప్లేగు వ్యాధి నిజంగానే వ్యాపిస్తోందా? అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.
‘ప్లేగు వ్యాధిని ఒకప్పుడు మనం నియంత్రణలోకి తెచ్చాము. కానీ ఈ సూక్ష్మక్రిములు రానురాను మరింత శక్తివంతంగా మారుతున్నాయి. తెలివి మీరిపోతున్నాయి. సైన్యంలా దాడులు చేస్తున్నాయి’ అని బుధవారం విలేకరులతో వ్యాఖ్యానించారు. ఈ విషయమై త్వరలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడతానని కూడా ట్రంప్ చెప్పారు. రష్యాతో ప్రస్తుతం సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. అమెరికా నిఘా వర్గాలకు త్వరలో మరింత సమాచారం లభిస్తుందని కూడా అన్నారు.
సైబీరియాలోని ఇర్కుటుస్క్ ప్రాంతంలోగల ప్లేగు వ్యాధి పరిశోధన సంస్థలో ఓ మహిళా వర్కర్ నిమోనియోతో మరణించారు. అయితే, ఆమె నిమోనియా వ్యాధి బారినపడటానికి కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఘటనపై ఇప్పటికే అక్కడి ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో కూడా ఈ ఘటనపై స్పందించారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించి రష్యా తమ వద్ద ఉన్న సమాచారాన్ని అంతర్జాతీయ సమాజంతో పంచుకోవాలని సూచించారు. అవసరమైతే రష్యాకు సాయం చేసేందుకు అమెరికా వద్ద సాధనాసంపత్తి ఉందని కూడా ఉన్నారు. ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తమకు మరింత సమాచారం కావాలని చెప్పారు. ప్లేగు అనేది చాలా సంక్లిష్టమైన వ్యాధి అని ట్రంప్ సోమవారం కూడా వ్యాఖ్యానించారు.
ప్లేగు వ్యాధి రష్యా నుంచి ఇతర దేశాలకు విస్తరించే అవకాశం తక్కువని ప్రపంచఆరోగ్య సంస్థ అంచనా వేసింది. పరిస్థితి అదుపులోనే ఉందని దేశ ప్రజలకు రష్యా అధికారులు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ల్యాబ్ వర్కర్‌తో గతంలో టచ్‌లో ఉన్న వారెవరిలోనూ మంగళవారం ప్లేగు వ్యాధి నిర్ధారణ కాలేదని దేశ వైద్యనియంత్రణ సంస్థ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
సౌదీలో పాక్, తుర్కియే బలగాలు హుతీల దాడులతో ‘మక్కా డీల్’ అమల్లోకి