Share News

Khammam Development: ఖమ్మంలో అభివృద్ధి జోరు.. 18న కీలక ప్రాజెక్టుల ప్రారంభం

ABN , Publish Date - Jan 16 , 2026 | 05:39 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.362 కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తావిస్తూ.. తమ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరం పని చేస్తోందన్నారు.

 Khammam Development: ఖమ్మంలో అభివృద్ధి జోరు.. 18న కీలక ప్రాజెక్టుల ప్రారంభం
Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం జిల్లా, జనవరి16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ఈ నెల18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మీడియాకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. శుక్రవారం మద్దులపల్లిలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి పొంగులేటి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఈ నెల 18న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. అదే రోజున పాలేరు నియోజకవర్గంలోనూ పర్యటిస్తారని మంత్రి పేర్కొన్నారు.


రూ.362 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం..

మద్దులపల్లిలో జేఎన్టీయూ ఫౌండేషన్, నర్సింగ్ కాలేజ్, మున్నేరు - పాలేరు లింక్ కెనాల్, కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రి, మార్కెట్ యార్డ్ ప్రారంభం సహా ఎన్నో కార్యక్రమాలను సీఎం ప్రారంభిస్తారని పొంగులేటి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రితో పాటు అదే సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి పాల్గొంటారని తెలిపారు. మొత్తం రూ.362 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని పొంగులేటి వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సన్నాహాక సమావేశం కూడా ఇక్కడే జరుగుతుందని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సీఎం మాట్లాడతారని మంత్రి అన్నారు.


నిరంతరం ప్రజల మధ్యనే..

ఎన్నికలప్పుడే తాము ప్రజల్లో తిరగడం లేదని.. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటున్నామని పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలా ఎన్నికలప్పుడు బొమ్మ చూపెట్టే ప్రభుత్వం కాదని.. తమ సర్కార్ ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేదని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ హైదరాబాద్‌లో తప్ప బయట ఎక్కడా కేబినెట్ సమావేశం జరగలేదని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈ నెల 18న మొట్టమొదటిసారిగా మేడారంలో కేబినెట్ మీటింగ్ జరగనుందన్నారు. కాకతీయుల నాటి రాతి కట్టడాలను తమ ప్రభుత్వం మేడారంలో ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చారు. ఆరోజు ఉదయం కొత్తగా ఏర్పాటుచేసిన రాతి కట్టడాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అన్నారు. కుంభమేళా కంటే అద్భుతంగా మేడారం జాతర ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. గడువు పూర్తైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 06:40 PM