జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
ABN , Publish Date - Apr 30 , 2026 | 06:36 PM
ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
ఖమ్మం జిల్లా, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. పదోతరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించి ఉజ్వల భవిష్యత్తు ఉండాల్సిన ఒక విద్యార్థిని ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం చింతగుర్తి గ్రామానికి చెందిన దారెల్లి వర్షిత (16) అనే విద్యార్థిని విషాదకరంగా ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం ఆలస్యంగా నిద్రలేచినందుకు తల్లి మందలించగా, ఆవేశానికి లోనైన వర్షిత ఇంట్లో ఉన్న ఎలుకల మందు పేస్టు తిని అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
వర్షిత పరిస్థితి విషమించడంతో ముందుగా ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వైద్యులు ఆమెను బతికించడం కోసం ప్రయత్నాలు చేసిన పరిస్థితి విషమించడంతో నిన్న (బుధవారం) మృతి చెందింది. మృతదేహాన్ని తిరిగి గ్రామానికి తీసుకువచ్చి ఈరోజు (గురువారం) అంత్యక్రియలు నిర్వహించారు.
చదువులో మెరిసి..
వర్షిత నిన్న(బుధవారం) విడుదలైన పదోతరగతి పరీక్షల ఫలితాల్లో 530 మార్కులు సాధించి చదువులో మంచి ప్రతిభ కనబరిచింది. ఈ విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు, స్నేహితులు, పాఠశాల ఉపాధ్యాయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జీవితంలో ఓడిపోయినా, చదువులో మాత్రం విజేతగా వర్షిత నిలిచిందని కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్
హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..
Read Latest Telangana News And AP News And International News And Telugu News