Share News

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:12 PM

దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ‘అటల్‌జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

రాజకీయాల్లో భాష మారాలి.. వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు
Venkaiah Naidu

ఖమ్మం జిల్లా, మార్చి 1(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) శతజయంతి ఉత్సవాలు జరగటం సంతోషకరమని భారత మాజీ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. ‘అటల్‌జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనం పుస్తకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తనకు పితృసామానులైన వాజ్‌పేయికి నివాళులర్పించడం తన బాధ్యత అని తెలిపారు. ఇవాళ(ఆదివారం) ఖమ్మం జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాజ్‌పేయి నాయకత్వంలో అఖిల భారత జనతా పార్టీకి అధ్యక్షుడిగా పని చేసే మహాభాగ్యం తనకు దక్కిందని చెప్పుకొచ్చారు. ప్రజా హృదయ సామ్రాట్‌గా అటల్‌జీని పిలుచుకుంటారని వివరించారు.


వాజ్‌పేయి జీవితాన్ని అధ్యయనం చేయాలి..

వాజ్‌పేయి ఎందరో నాయకులను తయారు చేశారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. నేటి యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. యువత వాజ్‌పేయి లాంటి నాయకులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, అభ్యంతరకరంగా మాట్లాడటం నేడు గొప్పతనంగా భావిస్తున్నారని.. అలా మాట్లాడటం గొప్పతనం కాదనే విషయాన్ని యువత తెలుసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. తాను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదని ఒక మిత్రుడికి చెప్పానని తెలిపారు. పత్రికల్లో, టీవీల్లో తాను పెద్దగా కనిపించడం లేదని ఆ మిత్రుడు అమెరికాలో అడిగారని ప్రస్తావించారు. పత్రికల్లో, టీవీల్లో అనుచితంగా మాట్లాడే వాళ్లని చూపిస్తున్నారని.. వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లని చూపిస్తున్నారని.. ఆ విధంగా మాట్లాడటం తనకు రాదని.. అలాంటి విమర్శలు తనకు చేతకాదని ఆ మిత్రుడికి చెప్పానని గుర్తుచేశారు. వాజ్‌పేయి వంటి మహానేత జీవితాలు ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆదర్శవంతమైన రాజకీయ నాయకులుగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు.


యువత రాజకీయాల్లోకి రాలేకపోతున్నారు..

నేటి రాజకీయ నాయకుల ప్రవర్తన, వాళ్ల మాటలు చూసి యువత రాజకీయాల్లోకి రావాలంటేనే ఆలోచిస్తున్నారని, ఉత్సాహంగా ముందుకు రాలేకపోతున్నారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. విలువలతో కూడిన రాజకీయం ప్రమాణాలు సిద్ధాంతాలతో కూడిన రాజకీయం మళ్లీ రావాలని ఆకాంక్షించారు. నేడు సిద్ధాంతాలు లేవని.. అంతా రాద్దాంతమేనని తెలిపారు. పదవుల కోసం పార్టీలు మారే రాజకీయాలు మంచిది కాదని హితవు పలికారు. పదవుల కోసం ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లుగా నేతలు పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఒకప్పుడు కశ్మీర్‌కి వెళ్లాలంటే అక్కడి ప్రభుత్వం అనుమతి తీసుకుని వెళ్లాలని, శ్యాం ప్రసాద్ ముఖర్జీ అందుకు ఒప్పుకోలేదని ప్రస్తావించారు. తన దేశంలోకి వెళ్లటానికి తనకు అనుమతి ఎందుకంటూ ఆయన కశ్మీర్‌లో ప్రవేశించారని గుర్తుచేశారు. అక్కడ శ్యాంప్రసాద్ ముఖర్జీని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అలాంటి రాజకీయ నేతలు మనందరికీ ఆదర్శం కావాలని సూచించారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడిన ఎందరో మహానీయులు యువతకు ఆదర్శం కావాలని వెంకయ్య నాయుడు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

విద్యా కమిషన్ సిఫారసులతో పేద విద్యార్థులు విద్యకు దూరం: బండి సంజయ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 01 , 2026 | 02:15 PM