CM Revanth Reddy: అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:06 PM
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను తరిమికొట్టాలని హెచ్చరించారు.
ఖమ్మం జిల్లా, జనవరి18 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను తరిమికొట్టాలని హెచ్చరించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ హయాంలో పేదలను ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు. పేదలను ఇబ్బందులకు గురిచేసిన బీఆర్ఎస్ దిమ్మలు కూలగొట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి..
ఖమ్మం జిల్లాలో ఆదివారం పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మద్దులపల్లిలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
మోసం చేశారు..
బీఆర్ఎస్ హయాంలో పేదవాడికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇస్తామని నమ్మించి మోసం చేశారని సీఎం ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకున్నామని.. కాంగ్రెస్ పాలనలోనూ సంక్షేమాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నేడు తమ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం అందజేస్తున్నామన్నారు.
సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ దగ్గర చేశారు..
నేడు నందమూరి తారక రామారావు వర్థంతిని స్మరించుకుంటూ.. అందరూ తెలుగు వాళ్లను 'మదరాసీ'లని అంటుంటే ఆత్మగౌరవంతో నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లాలో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానులు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావించారు. పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని ప్రశంసించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పేదలకు సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేదలకు సంక్షేమం అందించడమే ఎన్టీఆర్‌కు మనమిచ్చే ఘన నివాళి అని తెలిపారు. 2007 సంవత్సరంలో మొదటిసారిగా తాను మధిర నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నానని ప్రస్తావించారు రేవంత్. అప్పుడే స్నానాల లక్ష్మీపురం వెళ్లి మల్లు భట్టివిక్రమార్కను స్వగ్రామంలో చూశానని గుర్తుచేశారు. ఈ ఇరవై సంవత్సరాల్లో తానెప్పుడు వచ్చినా ప్రజలు ప్రేమాభిమానాలు పంచారని చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటానికి ప్రజలు ఇచ్చిన సహకారం మరవలేనిదని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాయకుడికి సీఎం చంద్రబాబు, లోకేశ్ ఘన నివాళి..
మౌని అమావాస్య అని ఎందుకు పిలుస్తారో తెలుసా..?
For More TG News And Telugu News