Minister Thummala: ఆ నలుగురు సీఎంలపై మంత్రి తుమ్మల ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Jan 17 , 2026 | 09:53 AM
మాజీ సీఎం కేసీఆర్ స్టైల్ వేరని.. ఇంట్లో కూర్చున్నా స్ట్రాటజిక్‌గా రాజకీయాలు చేస్తారని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఏ ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారని కొనియాడారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవ్వరినీ నొప్పించకుండా తాను పనిచేశానని చెప్పుకొచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి17 (ఆంధ్రజ్యోతి): గత కేసీఆర్ ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయం అభివృద్ధి సాధ్యపడలేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. శ్రీ రామనవమి నాడు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రామాలయం విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తామని చెప్పుకొచ్చారు. నలబై ఏళ్ల తన రాజకీయ జీవితంలో ప్రజాసేవ చేసే భాగ్యం భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆశీస్సులతో దక్కిందని తెలిపారు. ఇవాళ(శనివారం) భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి తుమ్మల పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్ చేశారు మంత్రి తుమ్మల.
ఎన్టీఆర్ నీతి, నిజాయితీ రాజకీయాలు నేర్పారు...
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నీతి, నిజాయితీ రాజకీయాలు ఎలా చేయాలో నేర్పారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కష్టపడితే మామూలు వాళ్లు కూడా రాజకీయాల్లో ఏదైనా సాధించవచ్చని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చూపించారన్నారు. మాజీ సీఎం కేసీఆర్ స్టైల్ వేరని.. ఇంట్లో కూర్చున్నా స్ట్రాటజిక్‌గా రాజకీయాలు చేస్తారని తెలిపారు. రేవంత్‌రెడ్డి ఏ ఆధారం లేకుండా కింది స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగారని కొనియాడారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద ఎవ్వరిని నొప్పించకుండా తాను పనిచేశానని వ్యాఖ్యానించారు. అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీ టూరిజం రంగాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగుకు ఎన్టీఆర్ హయాంలో శ్రీకారం చుట్టామని గుర్తుచేశారు. తెలంగాణలో పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తరించడమే తమ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుందని తెలిపారు. ప్రాసెసింగ్ ప్లాంట్స్‌తో పంటలకు అదనపు విలువ ఉంటుందని చెప్పుకొచ్చారు. తుపాన్‌లు, చీడపీడలు, కోతుల బెడద లేకుండా పామాయిల్ సాగు రైతులకు వరంగా మారిందని పేర్కొన్నారు. పామాయిల్‌లో అంతర పంటలుగా కోకో, జాజి, వక్క, మిరియం సాగులతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని వెల్లడించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
వారి వల్ల దేశం ప్రగతి బాటలో పయనిస్తోంది..
‘సమాజంలో జీవన ప్రమాణాలు పెరిగేలా చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తే సమాజం తిరిగి ఇస్తుంది. అబ్దుల్ కలాం, స్వామినాథన్, కురియన్ లాంటి మహానుభావుల వల్ల దేశం ప్రగతి బాటలో పయనిస్తోంది. రైతు కేంద్రంగా ప్రభుత్వ లక్ష్యాలు, పరిశోధనలు ఉండాలి. అడవిలో ఎలాంటి ఎరువులు లేకుండా మొక్కలు చక్కగా ఎదుగుతాయి. విచ్చలవిడిగా ఎరువులు, పురుగు మందులు వాడటం వల్ల కాలుష్యం పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మనకు వార్నింగ్ లాంటిది. కాలుష్యం లేకుండా భూమాతను కాపాడేలా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, పలు నిర్మాణాలను ఓ యజ్ఞంలా పూర్తి చేసే అవకాశం నాకు దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసే అదృష్టం దైవ నిర్ణయం. ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నలబై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజా సేవలా చేశాను. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో ముందు తరాలకు తెలిసేలా సీతారామ ప్రాజెక్టు, భద్రాద్రి రామాలయం పునరుద్ధరణ, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ చరిత్రలో నిలుస్తాయి’ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News