Bandi Sanjay: రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్ అనలేదా.. బండి సంజయ్ ఫైర్
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:21 PM
నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో మొదట నుంచి బీజేపీనే పోరాటం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని తెలిపారు..
కరీంనగర్, జనవరి8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్‌లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Union Minister Bandi Sanjay Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లది రాజకీయ డ్రామానేనని ఆరోపించారు. నీళ్ల విషయంలో మొదట నుంచీ బీజేపీనే పోరాటం చేసిందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ మెడలు వంచింది బీజేపీనేనని తెలిపారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ కొట్లాడలేదని అన్నారు. ఏపీ విభజన చట్టంలో ఆరు ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం తెలపొద్దని ఉందని ప్రస్తావించారు. ఆరు ప్రాజెక్టుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మరణ శాసనం విభజన చట్టంలోని ఈ అంశమేనని అన్నారు. కేసీఆర్.. అసలు నువ్వు విభజన చట్టం చదివావా.. అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పదేళ్లు ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. బండి సంజయ్ గురువారం కరీంనగర్‌లో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
నన్ను కేసీఆర్ ఎగతాళి చేశారు..
‘గతంలో ప్రగతి భవన్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పిలిచి.. కేసీఆర్ ఏదో చేశారని నేను అనుమానించాను. నన్ను కేసీఆర్ ఎగతాళి చేశారు. ఆనాడు బేసిన్‌లు లేవు.. భేషజాలు లేవని ఆయన చెప్పారు. కేసీఆర్, జగన్‌ది జలబంధం అని ఆనాడు వార్తలొచ్చాయి. వారిద్దరూ మంచి దావత్‌లు చేసుకున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇంటికి పోయి కేసీఆర్ చేపల పులుసు తిన్నారు. కేసీఆర్‌కు రోజా ఘనంగా స్వాగతం పలికారు. ఆ క్రమంలో రాయలసీమను రత్నాలసీమ చేస్తానని ఆయన అనలేదా. ఏపీకి పెద్దన్న పాత్ర పోషిస్తానని చెప్పలేదా..?’ అని బండి సంజయ్ కుమార్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కవిత నిజాలు బయటపెట్టాలి..
‘రోజా ఇంట్లో ఆనాడు ఏం జరిగిందో కల్వకుంట్ల కవిత బయటపెట్టాలి. కవిత నిజాలు బయటపెడుతుందని అనుకుంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను నేనే అడ్డుకున్నా. సంగమేశ్వర ప్రాజెక్టును ఏపీ అక్రమంగా కడుతున్నా కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదు. కేసీఆర్ రీ డిజైన్ రివర్స్ అయ్యిందని పేపర్‌లలో వచ్చింది. చంద్రబాబు నీ ఆటలు సాగవు అంటూ కేసీఆర్ అప్పట్లో పెద్ద డైలాగులు కొట్టారు. కృష్ణానది మీ జాగీరా అని కేసీఆర్ బాంబులు పేల్చారు.. కానీ పిట్టల దొర మాటలేనని ప్రజలకు ఆలస్యంగా అర్థమయ్యాయి. 299 టీఎంసీలు చాలని కేసీఆర్ ఒప్పుకొన్నారు. ఆయన ఎవరిని అడిగి ఆనాడు ఒప్పుకొన్నారు. తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆరేనని కేంద్ర మంత్రులు చెప్పారు. 571 టీఎంసీలకు గానూ ఆయన 299 టీఎంసీలకే అంగీకరించారు. ఈ విషయంలో ఆయనకు డాక్యుమెంట్లు పంపించా’ అని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
విద్యార్థులకు అలర్ట్.. సంక్రాంతి సెలవులపై క్లారిటీ..
Read Latest Telangana News And Telugu News