వినిపించని కిలకిలలు
ABN , Publish Date - Mar 20 , 2026 | 10:48 AM
తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలతో పల్లెలు మేల్కొనేవి, ఎటుచూసినా పక్షుల రాగాలే... ఇంటి ముందు వేలాడదీసిన వరి గొలుకలు తింటూ పిచ్చుకలు సంగీతాన్ని వినిపించేవి.
పంట పొలాలపై రసాయనాలు, చెట్ల నరికివేత
అంతరించిపోయే దశలో పిచ్చుకలు
నేడు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం
కరీంనగర్: తెల్లవారుతుండగా పక్షుల కిలకిల రాగాలతో పల్లెలు మేల్కొనేవి, ఎటుచూసినా పక్షుల రాగాలే... ఇంటి ముందు వేలాడదీసిన వరి గొలుకలు తింటూ పిచ్చుకలు సంగీతాన్ని వినిపించేవి. నేడు ఆ పరిస్థితి లేదు. రోజు రోజుకు వాతావరణంలో వచ్చే మార్పులతో పిచ్చుకల మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. అంతరించే దశలో ఉన్న పిచ్చుకలతో పాటు ఇతర జీవులను రక్షించుకోలేక పోతే భవిష్యత్తు తరాలకు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. పర్యావరణ పరిరక్షణకు పాటుపడి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడకపోతే భవిష్యత్తు అంధకారమే. దీనిపై ప్రభుత్వాలు, పాలకులు స్వచ్ఛంద సంస్థలు పౌరులు స్పందించి పిచ్చుకల సంరక్షణ కోసం నడుం బిగించాల్సిన అవసరం ఉంది.
పిచ్చుకలపై రేడియేషన్ ప్రభావం
సెల్‌ఫోన్ సిగ్నల్స్ తీవ్రత (రేడియేషన్) అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఊరపిచ్చుకలు మనుగడ సాగించలేవని ఇప్పటికే పలు అధ్యయనాల్లో వెల్లడైంది. సెల్‌ఫోన్ టవర్‌ల నుంచి వెలువడే విద్యుదయ స్కాంత తరంగాలు పిచ్చుకలను తరిమివేస్తున్నాయ ని తాజాగా జరిపిన పరిశోధనల్లో తేలింది. గాలి కాలుష్యం పెరిగిపోవడం వలన కూడా పిచ్చుకలు తమ సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ఒక పక్క పంటలు పండే భూ విస్తీర్ణం తగ్గిపోవడం. మరొక పక్క ధాన్యపు పంటలలో, పండ్ల ఉత్పత్తిలో విచ్చల విడిగా రసాయనాలు, క్రిమి సంహారక మందులు ఉప యోగించడం, అటువంటి ధాన్యాలను పండ్లను ఆహారంగా తీసుకున్న పిచ్చుక జాతి అంతరించి పోతుందని వివిధ పరిశోధనల్లో తేలింది. కాలుష్యం, రేడియేషన్, చెట్లను నరికివేయడం మొదలైన వాటి కారణంగా భూతాపం పెరిగిపోయి పిచ్చుకల మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది. పరిమాణంలో చిన్న పక్షి పిచ్చుక అయినప్పటికీ ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థకు పిచ్చుకలు ఎంతగానో సహకరిస్తున్నాయి.
కరీంనగర్ జిల్లాలో భూ విస్తీర్ణంకు తగిన నిష్పత్తిలో అటవీ ప్రాంతం లేదు. సహజసిద్ధంగా ఉన్న గుట్టలను గ్రానైట్ వ్యాపారులు కబళిస్తూ బొందలగడ్డలుగా మార్చు తున్నారు. ఒక వైపు ఆవాసాలను కోల్పోయి, మరో వైపున ఆహారం లభించక, ఎక్కడో వ్యవసాయ క్షేత్రాల్లో పంట గింజలు దొరికినా అవి విషతుల్యం కారణంగా పిచ్చుకల జాతి రోజు రోజుకు అంతరించి పోతున్నది. ప్రజలు ఇళ్ల ముందు వీలున్నంత వరకు చిన్న చిన్న బియ్యం గింజలతో, ఒక తొట్టిలో తాగు నీరు పిచ్చుకలకు అందుబాటులో పెట్టి అంతరించిపోతున్న పిచ్చుకల జాతిని కాపాడుకోవాలని పక్షిప్రేమికులు కోరుతున్నారు. పురుగుమందు వాడకాన్ని తగ్గించటం వంటివి కొంత వరకు పిచ్చుకల మనుగడకు మేలు చేస్తాయి.
ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నేపథ్యం..
ప్రతి సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నాం. భారతీయ ప్రకృతి పరిరక్షకుడైన మహమ్మద్ దిలావార్ పిచ్చుకల పరిరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేచర్ ఫర్ సొసైటీ అనే సంస్థ ను స్థాపించాడు. తద్వారా అనేక రకాలుగా పిచ్చు కలను రక్షించడానికి వీలైన అవకాశాల్ని అందరితోనూ పంచుకున్నారు. ఈ సందర్భంలో పిచ్చుకల మను గడకు ప్రమాదం ఏర్పడితే మానవుల మనుగడకే ప్రమాదం అని గుర్తించిన ప్రపంచదేశాలు అంతరించి పోతున్న పిచ్చుకలను కాపాడుకొనేందుకు ఏటా పిచ్చుకల సంరక్షణ దినం జరుపుతున్నారు. ప్రపంచంలో ఏటా పిచ్చుకల సంఖ్య తగ్గిపోతుండటంతో ఐక్య రాజ్యసమితి స్పందించింది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ తయారు చేసిన రెక్ట్స్ జాబితాలోకి పిచ్చుకలను చేర్చింది. ఢిల్లీ ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం పిచ్చుకను రాష్ట్ర పక్షిగా ప్రకటించి సంరక్షణ చర్యలు చేపడుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News