Share News

యుద్ధ ట్యాంకుపై ఉత్తర కొరియా అధ్యక్షుడు! టీనేజ్ కూతురితో పాటూ..

ABN , Publish Date - Mar 20 , 2026 | 09:02 AM

కూతురితో కలిసి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ యుద్ధ ట్యాంకుపై ప్రయాణించిన ఫొటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కూతురిని తన రాజకీయ వారసురాలిగా ఆయన ప్రకటించనున్నారని దక్షిణ కొరియా చెబుతోంది.

యుద్ధ ట్యాంకుపై ఉత్తర కొరియా అధ్యక్షుడు! టీనేజ్ కూతురితో పాటూ..
Kim Jong Un, daughter on Military Tank

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన కూతురిని రాజకీయ వారసురాలిగా ప్రకటిస్తారన్న వార్తల నడుమ తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఉత్తర కొరియా సైన్యం నిర్వహించిన విన్యాసాలకు కిమ్ తన టీనేజ్ కూతురు కిమ్ జూ యేతో కలిసి హాజరయ్యారు. ఆమెతో కలిసి యుద్ధ ట్యాంకుపై ప్రయాణించారు. యుద్ధ ట్యాంకుపై కిమ్ కూర్చోగా ఆయన కూతురు ట్యాంకు లోపల కూర్చొని ప్రయాణించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్కడి ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న ట్యాంకుపై లెదర్ జాక్సెట్స్ ధరించిన కిమ్, ఆయన కూతురు ఫొటోలకు పోజులిచ్చారు.

కిమ్ కూతురు కిమ్ జూ యే వయసు 13 ఏళ్లని సమాచారం. ఈ మధ్య కాలంలో ఆమె తరచూ తండ్రితో కలిసి పలు అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో, ఆమె కిమ్‌కు రాజకీయ వారసురాలన్న టాక్ పతాకస్థాయికి చేరుకుంది. తండ్రీకూతుళ్ల ఫొటోలు తరచూ మీడియాలో ప్రచురితమవుతుంటాయి.


గత వారం స్థానిక ఆయుధ కర్మాగారంలో జరిగిన ఓ కార్యక్రమానికి కిమ్ తన కూతురితో కలిసి హాజరయ్యారు. రాకెట్ లాంచింగ్ వ్యవస్థ ప్రయోగాలను వీక్షించారు. ఈ సందర్భంగా కూతురితో కలిసి గాల్లో తుపాకీతో కాల్పులు జరిపారు. ఇక గతేడాది చైనా నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు కిమ్ తన కూతురితో కలిసి వెళ్లారు.

తన కూతురిని వారసురాలిగా కిమ్ త్వరలో ప్రకటించనున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ అంచనాకు వచ్చింది. కొందరు నిపుణులు మాత్రం ఈ అంచనాతో విభేదిస్తున్నారు. పురుషాధిక్య ధోరణులు ఉన్న ఉత్తరకొరియా పాలక వర్గం ఆమెను అంగీకరించదని చెబుతున్నారు. కిమ్ కూతురు కేవలం టీనేజర్‌యే అన్న విషయాన్ని కూడా పేర్కొంటున్నారు. ఇక అమెరికా, దక్షిణ కొరియా కలిసి ఇటీవల సైనిక విన్యాసాలు చేపట్టిన నేపథ్యంలో ఉత్తర కొరియా మిలిటరీ కూడా ట్రెయినింగ్ ఎక్సర్‌సైజులతో బలప్రదర్శన చేసింది.


ఈ వార్త చదవండి:

అమెరికాకు సైనిక స్థావరాలు ఇవ్వకండి.. ప్రాంతీయ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి

ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ లాండింగ్! ఇరాన్ మిసైల్ దాడి కారణమా?

Updated Date - Mar 20 , 2026 | 10:12 AM