ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ లాండింగ్! ఇరాన్ మిసైల్ దాడి కారణమా?
ABN , Publish Date - Mar 20 , 2026 | 07:18 AM
అమెరికాకు చెందిన అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ లాండింగ్ చేసింది. ఇరాన్ మిసైల్ దాడి వల్లే ఇలా జరిగి ఉండవచ్చన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్‌గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం గురువారం ఎమర్జెన్సీ లాండింగ్ చేయడం కలకలానికి దారి తీసింది. ఇరాన్‌పై సైనిక చర్యల్లో పాలుపంచుకుంటున్న సమయంలో విమానం అకస్మాత్తుగా వెనుదిరిగి సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా దిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ధ్రువీకరించింది. ఇరాన్ మిసైల్ ఢీకొనడంతోనే ఇలా జరిగి ఉండవచ్చన్న కథనాలు అంతర్జాతీయ మీడియాలో వెలువడ్డాయి. కాగా, ఎఫ్-35 విమానం సురక్షితంగా లాండ్ అయ్యిందని, పైలట్ సేఫ్‌గా ఉన్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించింది. ప్రస్తుతం అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా ఎఫ్-35 విమానాలను ఇరాన్‌పై మిషన్స్ కోసం వినియోగిస్తోంది.
ఇరాన్‌తో ఘర్షణలు మొదలైన నాటి నుంచీ ఇప్పటివరకూ కనీసం 16 అమెరికన్ ఫైటర్ జెట్స్ ధ్వంసమైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటితో పాటు 10 రీపర్ డ్రోన్‌లు, 6 ఇతర యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలపై గురువారం మధ్యాహ్నం అమెరికా యుద్ధ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పందించారు. ఇరాన్‌పై మునుపెన్నడూ చూడని స్థాయిలో దాడులు జరగనున్నాయని హెచ్చరించారు. యుద్ధంలో అమెరికా గెలుస్తోందని స్పష్టం చేశారు. మరోవైపు, హోర్ముజ్ జలసంధి రక్షణ కోసం తామూ రంగంలోకి దిగుతామని పలు ఐరోపా దేశాలు పేర్కొన్నాయి.
ఈ వార్తలూ చదవండి:
ఇరాన్ అగ్ర నేతలను లక్ష్యం చేసుకోవడం సరికాదన్న చైనా
హోర్ముజ్ మీదుగా వెళ్లాలంటే టోల్ ఛార్జ్.. ఇరాన్ సరికొత్త ప్లాన్ వేస్తోందా..